ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్. అయితే ఇప్పుడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్ధమైంది. నేడు(శనివారం) వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే ఈ పోరులో పలు మార్పులతో ముంబయి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో ముంబయి పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అనుకున్నట్టే అతడు మ్యాచ్‌కు దూరమైతే ఆ స్థానంలో మెరిడిత్ టీమ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక యంగ్ స్పిన్నర్ హృతిక్ షోకిన్ ప్లేస్‌లో కుమార్ కార్తీకేయకు అవకాశం ఇవ్వాలని ముంబయి మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అర్జున్ తెందుల్కర్ ఎంట్రీ ఛాన్స్.. మరోవైపు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ టీమ్‌లో జాయిన్ అయిన అతడు.. కనీసం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. యాజమాన్యం అతడికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. అయితే తాజా మ్యాచ్‌కు ముందు అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వస్తున్నాయి. దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమైనట్లు ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే దేశవాళీ క్రికెట్లో గోవా తరపున అర్జున్ ఆడుతున్నాడు. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే శతకంతో మెరిశాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచులు ఆడి 25 వికెట్లు, ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 9 వికెట్లు, 9 టీ20 మ్యాచులు ఆడి 12 వికెట్లు తీశాడు.
కాగా, ముంబయి తన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై.. పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ నిరాశపరిచారు. అలా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబయిని తిలక్ వర్మ (84 నాటౌట్; 46 బంతుల్లో 9×4, 4×6) ఆదుకుని విధ్వంసం సృష్టించాడు. దీంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది బెంగళూరు.
ఇదీ చూడండి:అల్లు అర్జున్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్.. వైరల్‌గా కావ్య పాప రియాక్షన్!