ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరింది. నేడు డబుల్ హెడ్డర్స్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- దిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అయితే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన సీఎస్కే.. 77 పరుగులు తేడాతో భారీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
224 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(50 బంతుల్లో 86; 7x4, 5x6 ) ధనాధన్ ఇన్నింగ్స్ వృథా అయిపోయింది. యశ్ ధుల్(13), అక్సర్ పటేల్(15) నామమాత్రపు స్కోరు చేశారు. చెన్నై బౌలర్ల దెబ్బకు పృథ్వీ షా (5), ఫిలిప్ సాల్ట్ (3), రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), నోకియా (0), కుల్‌దీప్ యాదవ్ (0) అందరూ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లతో మెరవగా.. మహీశ్ తీస్ఖానా, మథీషా ఫథిరానా తలో రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 79; 3x4, 7x6), డెవాన్ కాన్వేలు(52 బంతుల్లో 87; 11x4x 3x6) అర్ధశతకాలతో మెరవగా.. చివర్లో శివమ్ దూబే,(9 బంతుల్లో 22; 3x6) రవీంద్ర జడేజా(7 బంతుల్లో 20*; 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోకియా, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.