ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 దాదాపు ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ సీజన్లో బుధవారం జరిగిన 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై... ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరగుపర్చుకోగా... దిల్లీ మరో ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అయితే ఫలితం అటుంచితే ఈ మ్యాచ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతిని ఇచ్చాయి అవేంటంటే...
సిక్లర్లతో హోరెత్తించిన ధోని...
చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని ప్రేక్షకులనకు కనువిందు చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ధోని తనదైన శైలిలో సిక్స్‌లు బాదాడు. ఖలీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టి ఆడియెన్స్‌కు మజానిచ్చాడు.. మూడు బంతుల్లో 16 పరుగులు పిండుకున్నాడు. మళ్లీ ధోనిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఫ్యాన్స్.
సమన్వయం కోల్పోయిన మార్ష్.. ఫలితంగా రనౌట్ ...దిల్లీ క్యాపిటల్స్ ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు పారేసుకుంది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దిల్లీకి నాలుగో ఓవర్‌లో మరో షాక్ తగిలింది. కీలక సమయంలో దిల్లీ బ్యాటర్ మిచెల్ మార్ష్ (5) అనవసరంగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి బంతిని మనీశ్ పాండే ఎదుర్కొన్నాడు. వెంటనే మరో ఎండ్‌లో ఉన్న మార్ష్ రన్ కోసం పరుగెత్తాడు. ఇద్దరి మధ్య సమన్వయం లేక మరో వికెట్ చేజార్చుకున్నారు. దీంతో దిల్లీ పవర్ ప్లే లోనే మూడు కీలకమైన టాపార్డర్ వికెట్లు కోల్పోయింది.
కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నలలిత్..చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి నుంచే వికెట్లు పారేసుకుంది. ఓపెనర్లు సహా మొయిన్ అలీ వెనుదిరిగాక.. ధూబేతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుదాం అనుకున్న రహానేకు దిల్లీ బౌలర్ లలిత్ యాదవ్ షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతికి చెన్నై బ్యాటర్ అజింక్య రహనె ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అద్భుతమైన రీతిలో ఒంటిచేత్తో అందుకున్నాడు లలిత్. షాక్‌కు గురైన రహానే పెవిలియన్ చేరక తప్పలేదు.
రాణిస్తున్న జూనియర్ మలింగ..శ్రీలంక యంగ్‌స్టర్, చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలర్ మతీష పతిరన ఈ సీజన్లో దుమ్ము దులిపేస్తున్నాడు. బుధవారం చెపాక్ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరన అద్బుతమైన ప్రదర్శన చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి పతిరన నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చినప్పటికీ... మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జూ. మలింగ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16-20) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పతిరన నిలిచాడు. ఇప్పటివరకు అతడు చిలరి నాలుగు ఓవర్లలో 12 వికెట్లు పడగొట్టాడు.