ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై తమ ఇన్నింగ్స్‌ను ముగిసింది చెన్నై సూపర్ కింగ్స్. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి దిల్లీ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ పోరులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 79; 3x4, 7x6), డెవాన్ కాన్వేలు(52 బంతుల్లో 87; 11x4x 3x6) హాఫ్ సెంచరీలతో మెరవగా.. చివర్లో శివమ్ దూబే,(9 బంతుల్లో 22; 3x6) రవీంద్ర జడేజా(7 బంతుల్లో 20*; 1x6) విలువైన ఇన్నింగ్స్ ఆడి మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోకియా, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
అయితే మ్యాచ్‌లో మాత్రం వీరందరీ ఆటతో పాటు మరో అంశం హైలైట్‌గా నిలిచింది. అదే సీఎస్కే కెప్టెన్ ధోనీ ఆటతీరు. ఆడింది ఐదు బంతులే.. చేసింది నాలుగు పరుగులే.. కానీ స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. మ్యాచ్ జరిగేది దిల్లీలోనే అయినా అభిమానుల మద్దతు చెన్నైవైపే నిలిచింది. ఎందుకంటే ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. అందుకే స్టాండ్స్ అంతా.. చెన్నై జెర్సీలతో కనువిందు చేశాయి.