ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లు మొదటి నుంచే ఆధిపత్యం కొనసాగించారు. ఓపెనర్‌గా దిగిన డేవన్ కాన్వే (77) దంచికొట్టాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (37) పరుగులు చేసి రాణించాడు. అజింక్య రహానే (9) పరుగులకే పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే (2) వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 134 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34) రాణించాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (18), త్రిపాఠి (21), క్లాసెన్ (17), జాన్సెన్ (17) ఫర్వాలేదనిపించారు. మార్క్రమ్ (12), మయాంక్ అగర్వాల్ (2), వాషింగ్టన్ సుందర్ (9) పరుగులు చేశారు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్, అభిషేక్ మంచి స్టార్ట్ అందించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగెత్తించలేక పోయారు. చెన్నై బౌలర్ల ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత ఓవర్లలో తక్కువ స్కోరుకే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా (3) వికెట్లు తీసి అదరగొట్టాడు. ఆకాశ్ సింగ్, తీక్షణ, మతీశ పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు.