తెలంగాణ

telangana

ETV Bharat / sports

వామ్మో ఏప్రిల్​ 23.. ఆర్సీబీ ఫ్యాన్స్​ను కలవరపెడుతున్న ఆ సెంటిమెంట్​!

ఐపీఎల్​లో అతి పెద్ద ఫ్యాన్​బేస్​ కలిగిన జట్లలో రాయల్స్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒకటి. ఎన్నో రికార్డులు ఆర్​సీబీ సొంతం. అయితే వారి అభిమానులను ఏప్రిల్ 23 తేది కలవరపెడుతోంది. ఇంతకీ ఏంటీ ఈ తేదీ విశేషం.. చూద్దాం.

ipl rcb april 23 sentiment
ipl rcb april 23 sentiment

By

Published : Apr 23, 2023, 2:06 PM IST

లీగ్​ మొదటి సీజన్​ నుంచి విరాట్​ ఆర్​సీబీతోనే ఉన్నాడు. క్రిస్​గేల్​, డివిలియర్స్, స్టెయిన్​ లాంటి భీకరమైన ఆటగాళ్లు సైతం ఆ జట్టులో ఆడినప్పటికీ.. ఐపీఎల్​ టైటిల్ ఆర్​సీబీకి అందని ద్రాక్షలాగే ఉంది. ప్రతి ఏటా "ఈ సాల కప్​ నమ్దే"( ఈ సారి కప్పు మాదే) అంటూ సీజన్ ప్రారంభించి ఆఖర్లో తడబడతారు. పదిహేనేళ్లుగా ఇదే తంతు. ఇదిచాలదు అన్నట్టుగా వారి ఫ్యాన్స్​ను ఒక తారీఖు ఆందోళనకు గురిచేస్తుంది.

అదేంటంటే.. టీ20ల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు క్రిస్​గేల్. గేల్​ 2011-17 సీజన్ల వరకు ఆర్​సీబీకి ఆడాడు. ఆర్​సీబీకి ఎన్నో విజయాలను అందించాడు. అయితే 2013లో సరిగ్గా ఇదే రోజున రాయల్స్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పుణె వారియర్స్​ ఇండియాతో తలపడింది.​ ఆ రోజు గేల్​ చేసిన విధ్వంసం ఐపీఎల్​ చరిత్రలో నిలిచిపోయింది. నమ్మశక్యం కానీ రీతిలో దయాదాక్షిణ్యం లేకుండా పుణె బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా 175 పరుగులు చేశాడు. 17 సిక్సర్లు 13 ఫోర్లతో సునామీ సృష్టించాడు ఈ యూనివర్సెల్​ బాస్​. దీంతో ఆర్​సీబీ 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి ఐపీఎల్​లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.

ఆ తర్వాత 2016లో మిస్టర్​ ఐపీఎల్​గా పేరున్న సురేశ్​ రైనా సారధ్యం వహించిన గుజరాత్​ లయన్స్​తో పోటీపడింది ఆర్​సీబీ. ఆ మ్యాచ్​లో గేల్​ త్వరగానే ఔటయినప్పటికీ కింగ్​ కోహ్లీ, సౌతాఫ్రికా స్టార్​ డివిలియర్స్​ బ్యాట్​ ఝుళిపించారు. పోటీపడి మరీ బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వారిద్దరూ శతకాలు పూర్తిచేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్​సీబీ 248 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఆర్​సీబీదే రికార్డు.

ఇదంతా నాణేనికి ఒక వైపు కాగా రెండో వైపున అత్యంత చెత్త రికార్డులను కూడా ఆర్​సీబీ తమ ఖాతాలో వేసుకుంది. 2017లో రాయల్స్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. కోల్​కతానైట్​ రైడర్స్​ను ఎదుర్కొంది. ఈ మ్యాచ్​లో కోల్​కతాను 131 పరుగులకే కట్టడి చేసిన ఆర్​సీబీ ఛేదనలో చతికిలపడింది. బ్యాటర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. ఒక్క ప్లేయర్​ కూడా డబుల్ డిజిట్​ అందుకోలేక పోయారు. 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటయ్యారు. 9 పరుగులు చేసిన జాదవే టాప్​ స్కోరర్​. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఘనతతో పాటు అత్యల్ప స్కోర్​ నమోదు చేసిన చెత్త రికార్డునూ మూటగట్టుకుంది.

ఇకపోతే గతేడాది సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో కూడా ఆర్​సీబీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హైదరాబాద్​ బౌలర్ల ధాటికి మరోసారి 100 పరుగుల లోపే చేతులెత్తేసింది ఆర్​సీబీ. 16.1 ఓవర్లలో 68 రన్స్​ చేసింది. ఈ మ్యాచ్​లో కోహ్లీ సహా మూడు డకౌట్లు నమోదు అయ్యాయి. అలా ఏప్రిల్ 23న ఆడిన ఈ నాలుగు మ్యాచుల్లోనూ రెండు అత్యుత్తమ, రెండు అతి ఘోరమైన ప్రదర్శనలు ఆర్​సీబీ సొంతం.

కాగా ఈరోజు రాయల్స్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రాజస్థాన్​ రాయల్స్​ను ఢీ కొట్టబోతోంది. మరి ఈ మ్యాచ్​లో ఆర్​సీబీ ప్రదర్శన ఎలా ఉండబోతోందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా 2011,2016 తరహా ఇన్నింగ్స్​లు పునరావృతం కావాలని ఆర్​సీబీ అభిమానులు ఆరాటపడుతున్నారు.

నేడు గ్రీన్​ జెర్సీలో ఆర్​సీబీ...ప్రతి సంవత్సరం లాగే ఈ సీజన్​లో కూడా ఆర్​సీబీ ఇవాళ గ్రీన్​ జెర్సీలో ఆడబోతోంది. 'గ్రీన్ గేమ్' ఆలోచనతో 2011 నుంచి ఆర్​సీబీ గ్రీన్​ జెర్సీలో ఆడుతోంది. పర్యావరణంపై అవగాహన పెంచడంలో భాగంలో ఓ ప్రయత్నంగా ఇలా తమ హోంగ్రౌండ్​లో జరిగే ఒక మ్యాచ్​లో జట్టు గ్రీన్​ జెర్సీ ధరిస్తుంది. ఈమ్యాచ్​లో టాస్​ అనంతరం ప్రత్యర్థి జట్టుకు ఓ మొక్కను బహుమతిగా అందజేస్తారు.

ABOUT THE AUTHOR

...view details