IPL 2023 GT vs SRH : ఐపీఎల్లో 16వ సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.హార్దిక్ సేన నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. షమి (4/21), మోహిత్ శర్మ (4/28) ధాటికి కుప్పకూలింది. క్లాసెన్ 64 పరుగులు మినహా ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు.. ప్లేఆఫ్ అవకాశాలను పూర్తిగా చేజార్చుకుంది. ఇక హైదరాబాద్‌పై విజయంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది గుజరాత్. ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచ్‌లలో.. 9 విజయాలు సాధించడం సహా పాయింట్ల పట్టికలో.. అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఛేధనకు దిగన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ఇద్దరూ పేలవ ప్రదర్శన చేశారు. అన్మోల్ ప్రీత్‌సింగ్ (5), అభిషేక్ శర్మ (5) పరుగులకే పెవిలయన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ మాయ చేస్తాడనుకుంటే.. అతడు కూడా విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి (1) అందరిబాటలోనే నడిచాడు. సన్విర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4) పరుగులు చేసి వెనుదిరిగారు. క్లాసెన్ (64; 44 బంతుల్లో 4×4, 3×6)పోరాటం ఏమాత్రం సరిపోలేదు.మార్కో జాన్సెన్ (3) పరుగులు చేశాడు. భువీ (18) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు తీసి చెలరేగారు. యశ్ దయాల్ 1 వికెట్ తీశాడు.