IPL 2023 MI vs GT : ఈ సీజన్లో లేటుగా పుంజుకుని 200 లక్ష్యాలను ఛేదిస్తూ టోర్నీలో ముందుకెళ్తున్న ముంబయి ఇండియన్స్.. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆ మార్క్‌ను దాటింది. శుక్రవారం సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్; 49 బంతుల్లో 11×4, 6×6) వీరబాదుడు బాదడంతో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌ను 191/8కు కట్టడి చేసింది. ఫలితంగా 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి.. 191 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు వికెట్లతో మెరిసిన రషీద్ ఖాన్.. బ్యాటింగ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 32 బంతుల్లో 10 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసినపప్పటికీ గుజరాత్ జట్టు.... లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అతను కాకుండా మిల్లర్ (41; 26 బంతుల్లో 4×4, 2×6) మెరిశాడు. ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (3/31), చావ్లా (2/36), కార్తికేయ (2/37) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 12 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కిది నాలుగో ఓటమి కాగా.. ముంబయి ఏడో విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ముంబయి ఇన్నింగ్స్..అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లో 218/5 భారీ స్కోర్‌ను సాధించింది. సూర్యకుమార్ యాదవ్(103*; 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ బాదేశాడు. ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29), నెహాల్ వధేరా (15), విష్ణు వినోద్ (30), టిమ్ డేవిడ్ (5), కామెరూన్ గ్రీన్ (3) పరుగులు చేశారు. దీంతో గుజరాత్ ముందు 219 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది ముంబయి ఇండియన్స్. గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్ 4 వికెట్లు, మోహిత్ శర్మ ఒక వికెట్ తీశారు.