IPL 2023 SRH vs RR : అంతగా బలంగా బ్యాటింగ్ లేని సన్‌రైజర్స్ జట్టు ఈ సారి మైదానంలో అదరగొట్టింది. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టుపై ఏకంగా 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అందరిని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ జట్టుకు చెందిన జోస్ బట్లర్, సంజు శాంసన్ తమ ఇన్నింగ్స్‌లో చెలరేగడం వల్ల మొదట రాజస్థాన్.. 2 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే సన్‌రైజర్స్ నుంచి మెరుపు వేగంతో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ , రాహుల్ త్రిపాఠి , క్లాసెన్ , ఫిలిప్స్, అబ్దుల్ సమద్ లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి ఛేదించింది.
కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఛేదన ఆసక్తికరంగా సాగింది. ఊరించిన విజయం దూరమైనట్లే కనిపించింది కానీ.. అదృష్టం ఆ జట్టు వైపే నిలిచింది. 73/1. ఛేదనలో 9 ఓవర్లలో సన్‌రైజర్స్ పరిస్థితిది. ఓపెనర్లు అభిషేక్, అన్మోల్ ప్రీత్ బ్యాట్ ఝుళిపించారు. కానీ వారి ముందున్న లక్ష్యం చాలా పెద్దది. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ దాదాపు 13కు చేరుకుంది. దీంతో చేతిలో 9 వికెట్లున్నా సన్‌రైజర్స్‌కు.. ఆ లక్ష్యాన్ని చేధించడం అనేది అంత తేలికైన పని కాదనిపించింది. కానీ అభిషేక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి చెలరేగడం వల్ల కొంత సేపటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కొన్ని చక్కని షాట్ల తర్వాత అభిషేక్ నిష్క్రమించినా.. 14 ఓవర్లలో 136/2తో విజయంపై సన్‌రైజర్స్ కన్ను పడింది. కానీ చకచకా మూడు వికెట్లు ( మార్‌క్రమ్, క్లాసెన్, త్రిపాఠి) వికెట్లు కోల్పోవడం వల్ల ఇక కష్టమే అనిపించింది.
చివరి రెండు ఓవర్లలో 41 పరుగులను స్కోర్ చేయాల్సిన పరిస్థితి. కానీ 19వ ఓవర్లో (కుల్‌దీప్) ఫిలిప్స్ వరుసగా 6, 6, 6 4 బాదేశాడు. తర్వాత అతడు ఔటైనా చివరి ఓవర్లో 17 చేయాల్సిన స్థితిలో సన్‌రైజర్స్ మళ్లీ రేసులోకి వచ్చింది. ఆఖరి ఓవర్ (సందీప్ శర్మ) తొలి అయిదు బంతుల్లో 12 పరుగులు రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి బంతికి సమద్ క్యాచ్ ఔట్ కావడం వల్ల రాజస్థాన్ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఆ జట్టుకు షాకిస్తూ అది నోబాల్‌గా డిసైడైంది. ఇక ఈ అవకాశాన్ని సమద్ వృథా చేయలేదు. బౌలర్ తలమీదుగా సిక్స్ కొట్టిన సమద్.. సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపించాడు. అంతకుముందు రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో అంతా బాదుడే.
మొదటి బంతి నుంచి ఆఖరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు రాయల్స్ ప్లేయర్లు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు.. యశస్వి మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత మరో ఓపెనర్ బట్లర్, సంజు శాంసన్ రెచ్చిపోయారు. తొలి అయిదు ఓవర్లలో రాజస్థాన్ 54 పరుగులు చేస్తే.. అందులో జైస్వాల్‌వే 35 కావడం గమనార్హం. అయిదో ఓవర్ ఆఖరి బంతికి అతడు వెనుదిరిగాడు. ఆ తర్వాత శాంసన్ వీర బాదుడు మొదలెట్టాడు. ఆలస్యమైన సరే బట్లర్ కూడా బౌండరీల మోత మోగించడం వల్ల స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బట్లర్, శాంసన్ రెండో వికెట్‌కు కేవలం 81 బంతుల్లోనే 138 పరుగులు జోడించడం విశేషం.
ఈ మ్యాచ్ రికార్డులు ఇవే..
- రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 300 ఫోర్లు బాదాడు.
- ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.
- రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వ జైస్వాల్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 1000 పరుగులు చేశాడు.
- హైదరాబ్ ఆడగాడు రాహుల్ త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటి వరకు 2000 పరుగులు చేశాడు.