తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : లఖ్​నవూపై ఆర్సీబీ ఘన విజయం.. 2015 తర్వాత కోహ్లీ అలా..

పరుగులు కష్టంగా వచ్చిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బెంగళూరుదే పైచేయిగా నిలిచింది. దీంతో ఛేదనలో చతికిలపడ్డ లఖ్‌నవూకు కొంత లక్ష్యమే కొండంతైంది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ.. 126 పరుగుల స్కోరును కాపాడుకుని టోర్నీలో అయిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

rcb vs lsg
rcb vs lsg

By

Published : May 1, 2023, 10:57 PM IST

Updated : May 2, 2023, 6:27 AM IST

బౌలర్లదే హవాగా నడిచిన పోరులో బెంగళూరు జట్టు మురిసింది. తక్కువ స్కోరే చేసినప్పటికీ.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై లఖ్‌నవూ మీద 18 పరుగుల తేడాతో విజయాన్ని ముద్దాడింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్​లో డుప్లెసిస్‌, కోహ్లీ రాణించగా.. రవి బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా, నవీన్​ ఉల్​, కృనాల్‌ ఆర్సీబీని కట్టడి చేసే పనిలో పడిపోయారు. అయితే ఈ పోరులో ఛేదనలో లఖ్‌నవూ ఘోరంగా విఫలమైంది. కర్ణ్‌ శర్మ, హేజిల్‌వుడ్‌ ఇతర బౌలర్లు విజృంభించడం వల్ల 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్‌ టాప్‌ స్కోరర్​గా నిలిచాడు.

తొలుత పరుగుల కోసం బెంగళూరు కష్టపడితే స్వల్ప ఛేదనలో అంతకన్నా ఎక్కువ చెమటోడ్చింది లఖ్‌నవూ. చకచకా వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. రెండో బంతికే మేయర్స్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయగా.. ఆ తర్వాత కృనాల్‌, బదోని, దీపక్‌ హుడా, పూరన్‌ క్యూ కట్టారు. ప్రమాదకర పూరన్‌ను కర్ణ్‌ అయిదో వికెట్‌గా వెనక్కి పంపేసరికి లఖ్‌నవూ స్కోరు 7 ఓవర్లలో 38/5.

అయితే మైదానంలో గౌతమ్‌తో పాటు స్టాయినిస్‌ ఉండడం వల్ల 65/5తో నిలిచిన లఖ్‌నవూలో ఆశలు వేగం పుంజుకున్నాయి. కానీ 11వ ఓవర్లో స్టాయినిస్‌ను కర్ణ్‌ ఔట్‌ చేయడం, తర్వాతి ఓవర్లో గౌతమ్‌ రనౌట్‌ కావడం వల్ల ఆ జట్టు ఆశలు నిరాశలుగా మారిపోయాయి. టెయిలెండర్లు కూడా క్రీజులో అద్భుతాలేమీ చేయలేకపోయారు. 15వ ఓవర్లో బిష్ణోయ్‌ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించే సమయానికి స్కోరు 77. మిశ్రా , నవీన్​ ఉల్​ కాస్త పోరాడి, కాస్త ఆసక్తిరేపినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. రాహుల్‌ గాయం కూడా లఖ్‌నవూకు ప్రతికూలమైంది. ఆఖరి వికెట్‌గా అతడు క్రీజులోకి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరుగెత్తలేకపోవడం వల్ల ఆఖరి ఓవర్లో అతడు స్ట్రైకింగ్‌కు వెళ్లలేకపోయాడు.

2015 తర్వాత ఇలా..ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటైన కోహ్లీ స్టైక్ రేట్​ 103.33గాఉంది. ఐపీఎల్‌లో 2015 సీజన్‌ తర్వాత ఇదే అత్యల్ప స్ట్రైక్​ రేట్‌(కనీసం 30 బంతులు ఎదుర్కొన్న తర్వాత).

అమిత్​ మిశ్రా అరుదైన ఘనత.. ఈ మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ వెటరన్‌ బౌలర్‌ అమిత్‌ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. తాజా మ్యాచ్​లో తీసిన రెండు వికెట్లతో కలిపి.. ఐపీఎల్ హిస్టరిలో 172 అత్యధిక​ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ముందుకెళ్లాడు. మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ వికెట్‌ తీసి.. ఐపీఎల్‌ టాప్‌-3 బౌలర్ల జాబితాలోకి దూసుకెళ్లాడు. ఏకంగా ముగ్గురు బౌలర్లను అధిగమించాడతడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్​లో డ్వేన్‌ బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చాహల్‌ (140 మ్యాచ్‌ల్లో 178 వికెట్లు), అమిత్‌ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే లఖ్​నవూతో మ్యాచ్​కు ముందు శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు), ముంబయి స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు), రాజస్థాన్‌ బౌలర్‌ అశ్విన్‌ (193 మ్యాచ్‌ల్లో 170 వికెట్ల)తో సమానంగా ఉన్నాడు. ఇప్పుడు వీరిని అధిగమించాడు.

ఇదీ చూడండి:IPL 2023 LSG VS RCB : కేఎల్​ రాహుల్​కు గాయం.. నొప్పితో విలవిలలాడిన కెప్టెన్​

Last Updated : May 2, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details