తెలంగాణ

telangana

IPL 2023: అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపులు.. ఆఖరికి సన్​రైజర్స్​ గట్టెక్కిందిగా!

By

Published : Apr 29, 2023, 10:56 PM IST

Updated : Apr 30, 2023, 6:36 AM IST

ఓ వైపు హ్యాట్రిక్‌ పరాజయాలు మరోవైపు ఓటమి భయం వీటి నడుమ సన్​రైజర్స్​.. ఇది శనివారం వారి పరిస్థితి. అయితే ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు అత్యావశ్యక విజయాన్నందుకుంది. యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు క్లాసెన్‌, మయాంక్‌ మార్కండేల శ్రమ తోడవ్వడం వల్ల సన్‌రైజర్స్‌.. దిల్లీని ఓడించింది. దిల్లీని గెలిపించాలని మిచెల్‌ మార్ష్‌ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయి.

Delhi Capitals vs Sunrisers Hyderabad
Delhi Capitals vs Sunrisers Hyderabad

ఐపీఎల్‌-16వ సీజన్​లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అయిదు ఓటమలు మూటగట్టుకుని ప్లేఆఫ్‌ రేసులో వెనుకబడ్డ సన్‌రైజర్స్‌.. శనివారం మ్యాచ్​తో కాస్త వేగం పుంజుకుంది. పరాజయాల పరంపరకు తెరదించుతూ దిల్లీపై 9 పరుగుల తేడాతో నెగ్గింది. అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపులతో మొదట హైదరాబాద్‌ 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. అక్షర్‌ పటేల్‌ కూడా తన బౌలింగ్​ స్కిల్స్​తో ఆకట్టుకున్నాడు.

మార్ష్‌ బ్యాటింగ్‌లోనూ చెలరేగడం, ఫిల్‌ సాల్ట్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో ఛేదనలో దిల్లీ దూసుకెళ్లింది. కానీ ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో సన్‌రైజర్స్‌ బౌలర్లు పుంజుకుని ఆ జట్టును కట్టడి చేశారు. చివరికి దిల్లీ 6 వికెట్లకు 188 పరుగులే చేయగలిగింది. మార్కండే, అభిషేక్‌ శర్మ, నటరాజన్‌ ఆకట్టుకున్నారు. 8 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం కాగా.. దిల్లీ తన ఖాతాలో ఆరో ఓటమిని వేసుకుంది.

ఆ వికెట్టే మలుపు:దాదాపు 200 లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇన్నింగ్స్‌ రెండో బంతికే వార్నర్‌ వికెట్‌ను కోల్పోయిన దిల్లీ జట్టు ఆ తర్వాత సాల్ట్‌, మార్ష్‌ల మెరుపులతో విజృంభించింది. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 5, 0 పరుగులే చేసిన సాల్ట్‌.. ఈసారి తన బ్యాట్‌ ధాటిని చూపించాడు.

ఇక మార్ష్‌ అయితే సిక్సర్లను బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో పవర్‌ ప్లే సమయానికి 57/1కు చేరుకున్న దిల్లీ జట్టు.. పదో ఓవర్లోనే సెంచరీని దాటేసింది. ఏ బౌలరూ వీరిని అడ్డుకోలేకపోయారు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేగాన్ని ఉపయోగించుకున్న ఈ జోడీ.. అతడి ఓవర్లో ఏకంగా 22 పరుగులను రాబట్టగలిగింది. ఇక 11 ఓవర్లకు 111/1తో పటిష్ట స్థితిలో నిలిచిన డీసీ.. సులువుగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని అనిపించింది.

కానీ తర్వాతి ఓవర్లో మార్కండే.. సాల్ట్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తర్వాత వికెట్ల పతనం కూడా వేగం పుంజుకుంది. మనీశ్​ పాండే వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయాడు. 41 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన స్థితిలో మార్ష్‌ను అకీల్‌ ఔట్‌ చేయడంతో డీసీ విజయావకాశాలకు దెబ్బ పడింది. గార్గ్‌ (12), సర్ఫ్‌రాజ్‌ (9) విఫలమవ్వగా.. అక్షర్‌ ఆఖరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

గత మ్యాచ్‌లో 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పరాభవాన్ని చవిచూసిన సన్‌రైజర్స్‌ జట్టు.. ఈసారి బ్యాటింగ్‌ తడబాటును అధిగమించి దాదాపు 200 స్కోరును సాధించగలిగింది. అయితే ఆ జట్టుకు మంచి ఆరంభమేమీ దక్కలేదు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మయాంక్‌, త్రిపాఠి, మార్‌క్రమ్‌, బ్రూక్​లు త్వరగానే పెవిలియన్‌కు వరుస కట్టారు. వీళ్లందరూ పేలవ షాట్లు ఆడి మరి క్యాచ్​కు ఔట్‌ అయ్యారు. తనలోని అసలైన ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని బయటపెడుతూ మిచెల్‌ మార్ష్‌.. బంతితో విజృంభించడం వల్ల సన్‌రైజర్స్‌ కాస్త ఇబ్బంది పడింది. అయితే ఓ వైపు అభిషేక్‌ శర్మ చెలరేగడంతో పరుగులు మాత్రం ఆగలేదు. ఓపెనింగ్‌ నుంచి మిడిలార్డర్‌కు వెళ్లిన బ్రూక్‌ వైఫల్యాన్ని కొనసాగిస్తే.. మిడిలార్డర్‌ నుంచి ఓపెనింగ్‌కు మారిన అభిషేక్‌ మాత్రం విజయవంతం అయ్యాడు. అలవోకగా భారీ షాట్లు ఆడి కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకాన్ని సాధించాడు. 12వ ఓవర్లో 109 స్కోరు వద్ద అభిషేక్‌ ఔటైతే.. అందులో దాదాపు 65 శాతం పరుగులు అతడివే.

ఇదీ చూడండి:విజయ్ శంకర్-గిల్ మెరుపులు​​.. కేకేఆర్​పై​ విజయం.. టేబుల్ టాప్‌లోకి గుజరాత్

Last Updated : Apr 30, 2023, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details