ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది కోల్‌కతా నైట్ రైడర్స్. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తాజా ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన జాసన్ రాయ్ వెన్నునొప్పితో బాధపడుతుండటం వల్ల అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రెహ్మనుల్లా గుర్బాజ్(39 బంతుల్లో 81; 5x4, 7x6) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. మిగితా బ్యాటర్లలో రింకూ సింగ్(19), ఎన్ జగదీశన్(19), వెంకటేశ్ అయ్యర్(11) విఫలమయ్యారు. చివర్లో వచ్చిన యాండ్రూ రసెల్(19 బంతుల్లో 34; 2x4, 3x6) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, జాష్వా లిటిల్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు.
మోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. కేకేఆర్‌పై ట్రోల్స్.. ఈ ఆసక్తికర మ్యాచ్‌లో కోల్‌కతా ప్రయోగం విఫలమైంది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపింది కేకేఆర్. అయితే అతడు మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ చేసిన ప్రయోగంపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.