టీమ్‌ఇండియా పేసర్, ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత స్టేడియంలో కనువిందు చేశాడు. సర్జరీ తర్వాత తొలిసారి మైదానంలో అభిమానుల మధ్య సందడి చేశాడు. ముంబయి ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు హాజరయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ అనంతరం బుమ్రా తమ జట్టుకు చీర్స్ చెబుతున్న ఫొటోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్‌మీడియాలో తమ అధికార ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. 'బూమ్.. బూమ్.. బుమ్రా..' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత బుమ్రాను చూసిన ముంబయి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు.
గత నెలలోనే అతడు గాయానికి సర్జరీ చేయించుకునేందుకు న్యూయార్క్ పయనమయ్యాడు. కాగా గాయం కారణంగా గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ తోపాటు ఈ ఏడాది స్వదేశంలో జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమయ్యాడు. కానీ రీసెంట్గా సర్జరీ చేయించుకున్న అతడికి మరింత విశ్రాంతి అవసరం. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అతడు ఆడలేడు. అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.