మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అయిదో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఆ జట్టు 55 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది. మొదట బరిలోకి దిగిన టైటాన్స్.. నిర్దిష్ట 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ మరో అర్ధశతకాన్ని అందుకోగా.. మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా విధ్వంసం సృష్టించారు. ముంబయి బౌలర్లలో పియూష్ చావ్లా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ (3/37), రషీద్ ఖాన్ , మోహిత్ శర్మ దెబ్బకు ఛేదనలో ముంబయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులకే పరిమితమైంది. కాగా నేహల్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఒక సిక్సర్, ఒక ఫోర్ (బ్యాటర్ సాధించింది), ఒక వికెట్.. పవర్‌ప్లేలో ముంబయి జట్టు స్కోర్ 29/1. ఆరంభమే పేలవంగా మొదలెట్టిన ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్‌ను వెనక్కిపంపి ప్రత్యర్థికి హార్దిక్ షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఇషాన్.. నత్తనడనకగా బ్యాటింగ్ కొనసాగించాడు. తాను ఆడిన తొలి 10 బంతుల్లో 2 పరుగులే చేసి.. 12వ బంతికి కానీ బౌండరీ సాధించలేకపోయాడు. ఆ తర్వాత కూడా పేలవ ప్రదర్శనను కొనసాగించిన ఇషాన్.. మరిన్ని బంతులు వృథా చేసి రషీద్ వలలో చిక్కాడు.