IPL 2023 : ఐపీఎల్ 16 సీజన్‌లో భాగంగా హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించింది.
హైదరాబాద్ జట్టు : మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ ( వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే
పంజాబ్ జట్టు :శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాత్యూ, జితేశ్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కుర్రన్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
సన్‌రైజర్స్ బోణీ కొట్టేనా..
వరుసగా రెండు ఓటములు.. సొంత మైదానంలోనైనా గెలుస్తారనుకుంటే అదే తడబాటు. ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇదీ.. ఇప్పుడు మళ్లీ ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బౌలింగ్ విభాగంపై ఇబ్బందులేమీ లేవు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోవడం సన్‌రైజర్స్‌కు అలవాటైంది. తొలి రెండు మ్యాచుల్లో కనీసం 150 పరుగుల మైలురాయిని కూడా తాకలేదంటే అతిశయోక్తి కాదు. జట్టులో బ్యాటర్లకు కొదవేం లేదు. అయినా సరే తీసికట్టు ప్రదర్శనతో విమర్శలపాలైంది.
ఐపీఎల్ మినీ వేలంలో రూ. 13కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలం కావడం సన్‌రైజర్స్ అభిమానులకు మింగుడుపడని విషయం. అతడి స్థానంలో కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌కు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చిన కెప్టెన్ మార్‌క్రమ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తనపై పెట్టుకున్న ఆశలను ఈ మ్యాచ్‌లోనైనా నెరవేర్చాలి. రాహుల్ త్రిపాఠి, అన్‌మోల్ ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్ బ్యాటింగ్‌లో కాస్త రాణిస్తున్నారు. భారత సీనియర్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ బాధ్యతారాహిత్యంగా ఆడటం కలవరపెట్టే అంశం. సొంత మైదానంలో జరిగే మ్యాచుల్లోనైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. ఉమ్రాన్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌తో కూడిన పేస్ దళం ఎక్కువగానే పరుగులు సమర్పిస్తున్నారు. అదిల్ రషీద్ నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు.
పిచ్ రిపోర్ట్..
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ 20 సార్లు తలపడగా.. హైదరాబాద్ 13 మ్యాచుల్లో గెలిచింది. మరో ఏడు మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించింది.