IPL 2022: టీ20 లీగ్ చరిత్రలో ఐదుసార్లు తన జట్టుకు కప్ అందించిన సారథి అతడు... దిగ్గజ కెప్టెన్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీకి సాధ్యం కాని రికార్డూ అతడి పేరిట సొంతం.. విరాట్ కోహ్లీ నుంచి నాయకత్వ పగ్గాలు అందుకుని మరీ టీమ్‌ఇండియానే అప్రతిహతంగా నడిపిస్తోన్న ఆ కెప్టెన్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ.. హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ.. అతని సారథ్యంలోని ముంబయి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ను గెలవలేకపోయింది. మరి ఎందుకిలా అవుతుందో ఓ సారి విశ్లేషిద్దాం..
భారత కెప్టెన్సీకి మార్గమదే..!
ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న రోహిత్ టీమ్‌ఇండియాకు సారథిగా ఎంపిక కావడానికి ప్రధానం కారణం.. ముంబయి కెప్టెన్‌గా విజయవంతం కావడమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలపడం సాధారణ విషయమేమీ కాదు. తీవ్ర పోటీ ఉండే టీ20 లీగ్‌లో ఆ ఫీట్‌ను సాధించడమే రోహిత్ శర్మకు ప్లస్ అయింది. విరాట్ కంటే ముందే భారత జట్టు నాయకత్వ బాధ్యతలు అందుకునే అవకాశం రోహితుడికే దక్కాల్సింది. అయితే దూకుడు, భీకర ఫామ్‌లో ఉండటం విరాట్ కోహ్లీకి కలిసొచ్చి కెప్టెన్సీ వరించింది. అయితే విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల బీసీసీఐ మరే ఇతర ఆటగాళ్ల గురించి ఆలోచించకుండా రోహిత్‌కే అన్ని ఫార్మాట్ల పగ్గాలను అందించింది. వయసురీత్యా రోహిత్ (34) ఇంకో నాలుగైదేళ్లు మాత్రమే ఆడగలడు. అయినా కెప్టెన్‌గా నియమించిందంటే రోహిత్‌పై ఉండే నమ్మకం ఇది.
నాయకత్వమే భారమా..? వారి వైఫల్యమా?
భారత్ క్రికెట్ జట్టు సారథిగా ఎంపికైన తర్వాత ఆడిన ప్రతి సిరీస్‌నూ రోహిత్ టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహకారంతో సొంతం చేసుకుంటూనే వచ్చాడు. న్యూజిలాండ్, లంక, విండీస్ జట్ల మీద టీ20 సిరీస్‌లను నెగ్గాడు. నూతన సమరోత్సాహంతో టీ20 లీగ్‌లోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లను ఆడిన ముంబయి ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది. బోణీ కొట్టలేకపోయింది. వ్యూహాలను అమలు చేయడంలో రోహిత్ విఫలమవుతున్నాడా..? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత సీజన్ వరకు ముంబయి జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్‌రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్‌లో సహకారం లేదు.