IPL 2022 playoff points: ఐపీఎల్ ఈ సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు సాధించాలి. అంటే ఏడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఒకవేళ నాలుగు కన్నా ఎక్కువ జట్లు 14 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్లే నాకౌట్ దశకు చేరుకుంటారు. మరోవైపు ఇప్పటికే అన్ని జట్లు 7, 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా ముంబయి మినహా మిగతావన్నీ ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలున్నాయి. ఇందులో గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ తేలిగ్గా చేరుకునే వీలుంది. దీంతో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
గుజరాత్: ఏమాత్రం అంచనాల్లేని కొత్త జట్టు గుజరాత్ ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి టాప్‌లో దూసుకుపోతోంది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ జట్టు బలం చూస్తోంటే ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిచినా చాలు. అప్పుడు మొత్తం 18 పాయింట్లతో నిలిచే అవకాశం ఉంది. దీంతో తేలిగ్గానే ప్లేఆఫ్స్ చేరుతుంది.
హైదరాబాద్: తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సినవి ఇంకా 7 మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిల్లో కనీసం మూడు గెలిచినా 16 పాయింట్లతో నిలుస్తుంది. దాంతో హైదరాబాద్ అవకాశాలకు ఢోకా లేదు.
రాజస్థాన్:హైదరాబాద్‌లాగే రాజస్థాన్ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కానీ, రన్‌రేట్ పరంగా కాస్త వెనుకపడటంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 3 గెలిచినా 16 పాయింట్లతో టాప్ ఫోర్‌లో చోటు దక్కించుకునే వీలుంది.
లఖ్‌నవూ: గుజరాత్‌లాగే ఈసారి కొత్తగా వచ్చిన జట్టు లఖ్‌నవూ. ఇది కూడా బాగా రాణించడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి మొత్తం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ, అప్పుడు ఇతర జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లఖ్‌నవూ వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాలి.
బెంగళూరు:లఖ్‌నవూలాగే బెంగళూరు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. అయితే, రన్‌రేట్ పరంగా వెనుకపడిపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్ మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి స్థానాల్లో ఉన్న దిల్లీ, కోల్‌కతా, పంజాబ్ జట్లు దీన్ని వెనక్కినెట్టే ప్రమాదం లేకపోలేదు.
దిల్లీ:గత కొద్ది సీజన్ల నుంచి వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటున్న దిల్లీ ఈసారి కొంచెం గాడితప్పినట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలిస్తే చివరికి 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ, అంతటితో సరిపెట్టుకుంటే టాప్ ఫోర్‌లో నిలవడం చాలా కష్టం. కాబట్టి ఇది కూడా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు సొంతం చేసుకోవాలి.