IPL 2022: దాదాపు సగం టోర్నీ ముగిసింది. ఒక్కో జట్టు కనీసం ఏడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. ఇక పాయింట్ల పట్టికలో కొత్త జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. ఛాంపియన్ జట్లు కుదేలై అట్టడుగున నిలిచాయి. ఇవేం ఆడతాయిలే అనుకున్న కొన్ని జట్లు అనూహ్యంగా విజయాలతో విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో పది టీమ్‌లు ఎలాంటి ప్రదర్శన చేశాయి.. ఎవరు ముందడుగు వేశారో తెలుసుకుందాం..
గుజరాత్ (12):టీ20 లీగ్‌లో తొలిసారి హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ (12) చెలరేగుతోంది. ఏడు మ్యాచ్‌లకు గాను కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడి ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదీనూ హైదరాబాద్ మీద ఓడిపోయింది. హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోపాటు షమీ, తెవాతియా, డేవిడ్ మిల్లర్, లాకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో గుజరాత్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థులకు సవాల్‌గా మారింది.
హైదరాబాద్ (10):పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు హైదరాబాద్. ఆరంభంలో రెండు మ్యాచ్‌లను ఓడి విమర్శలపాలైన హైదరాబాద్ మూడో మ్యాచ్ నుంచి తన తడాఖా చూపించింది. హేమాహేమీ జట్లను ఓడించింది. ప్రస్తుతం పాయింట్ల పరంగా టాప్‌లో ఉన్న గుజరాత్‌ను మట్టికరిపించిన జట్టు కూడా హైదరాబాదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లను ఆడిన హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. బెంగళూరును తక్కువ పరుగులకే (68) కుప్పకూల్చి మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది.
రాజస్థాన్ (10) :జోస్ బట్లర్ విజృంభణతోపాటు యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ విజయాల బాటలో నడుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక స్కోరు కూడా రాజస్థాన్ పేరు మీదనే ఉంది. దిల్లీపై 222 పరుగులు సాధించింది. అయితే దిల్లీ కూడా దీటుగా బదులిచ్చినా చివరికి రాజస్థాన్‌నే విజయం వరించింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లను ఆడిన రాజస్థాన్ (10) ఐదు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బట్లర్ మూడు శతకాలు, చాహల్ హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శన చేశారు. ఇదే ప్రదర్శన ఆఖరి వరకూ చేస్తే కప్ కొట్టే జట్లలో రాజస్థాన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బెంగళూరు (10):గత నాలుగేళ్లుగా ప్రతి సీజన్‌కు ముందు ఒకటే నినాదం.. ఈసాలా కప్ నమదే.. అయితే ఆ జట్టు పరిస్థితిలో మాత్రం మార్పులేదు. కానీ ఈసారి మాత్రం కొత్త కెప్టెన్ డుప్లెసిస్ నేతృత్వంలోని బెంగళూరు విజృంభిస్తోంది. ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో టాప్-4లో కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్ప (68) స్కోరును నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందో లేదోనని మరోసారి అనుమానాలు రేకెత్తిస్తోంది.
లఖ్‌నవూ (8):కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా రాణిస్తూ లఖ్‌నవూ జట్టును నడిపిస్తున్నాడు. జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ కొన్ని మ్యాచుల్లో గెలుపు వాకిట బోల్తా పడుతోంది. ఏడు మ్యాచులను ఆడిన లఖ్‌నవూ నాలుగు విజయాలను సాధించింది. అలానే మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో లఖ్‌నవూ (8) ఐదో స్థానంలో ఉంది. ఇంకా సగం మ్యాచులు ఉన్న నేపథ్యంలో కనీసం నాలుగు మ్యాచుల్లోనైనా గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి మ్యాచ్ ఫలితమూ కీలకం. అన్ని విభాగాలు సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉంది.
దిల్లీ (6):ఘన విజయాలను నమోదు చేసిన జట్టు.. స్వల్ప తేడాతో ఓటములను కొనితెచ్చుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన జట్టు దిల్లీ. మొదటి మ్యాచ్‌లోనే ఛాంపియన్ ముంబయిని ఓడించి సంచలనం సృష్టించిన దిల్లీ ఆ తర్వాత తడబాటుకు గురైంది. ప్రస్తుతం ఏడు మ్యాచులకుగాను కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. నాలుగు మ్యాచుల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది. డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, పృథ్వీషా, పావెల్ ఫామ్‌లోకి రావడం దిల్లీకి కలిసొస్తుంది. మరి మిగతా మ్యాచుల్లోనైనా రాణించాలని ఆశిద్దాం..