IPL 2022: టీ20 లీగ్‌లో ఈసారి వింత పరిస్థితి నెలకొంది. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన కొన్ని జట్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుండగా.. కొత్త జట్లతో పాటు మరికొన్ని టీమ్‌లు అదరగొడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన జట్లు ఈ సారి అట్టడుగు స్థానాలకు పరిమితమవడానికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు రాణించకపోవడం వల్లే ఆ జట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అర్థమవుతోంది. మరి ఆ జట్లు ఏవి.. ఆ ఫాస్ట్‌బౌలర్లు ఎవరు అనేది దానిపై ప్రత్యేక కథనం.
ముంబయిని ముంచుతోంది.. ఫాస్ట్‌బౌలర్లే:టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి జట్టు. అత్యధిక టైటిళ్లు (5) నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబయి.. ఈ సారి దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతోంది. ఈ జట్టులోని ఫాస్ట్‌బౌలర్లు ధారాళంగా పరుగులిస్తూ వికెట్లు పడగొట్టడం లేదు. నేటితరం మేటి బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయడం లేదు. మిగతా బౌలర్లు నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల అతడు ఒత్తిడికి లోనవుతున్నాడు. గతంలో బుమ్రాకు తోడుగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈసారి జట్టులో లేడు. ఇది కూడా ముంబయి బౌలింగ్‌పై ప్రభావం చూపుతోంది. జయదేవ్ ఉనద్కత్, బసిల్ థంపి, టైమల్ మిల్స్, రిలె మెరిడిత్ వంటి ఫాస్ట్‌బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అందుకే ముంబయి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇకనైనా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్లు గాడినపడతారో లేదో చూడాలి.
చెన్నై ఓటములకు ప్రధాన సమస్య అదే:డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై కూడా ఈ సారి పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే నెగ్గింది. చెన్నై ఓటములకు ఫాస్ట్‌బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమవడం వల్ల చెన్నైకి గట్టి షాక్ తగిలింది. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో కాస్త పరుగులు ఎక్కువగా ఇస్తున్నా వికెట్లు పడగొడుతున్నారు. క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ ప్రభావం చూపలేకపోతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసే నమ్మకమైన ఫాస్ట్‌బౌలర్ లేకపోవడం చెన్నైకి తీవ్ర ప్రతికులాంశంగా మారింది. రానున్న మ్యాచ్‌ల్లో ఫాస్ట్‌బౌలర్లు పుంజుకుంటేనే ఆ జట్టు విజయాలు సాధించే అవకాశం ఉంది.
మంచి బౌలర్లు ఉన్నా.. కోల్'కథ' మారట్లేదు:2012, 2014 సంవత్సరాల్లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు సీజన్‌లో ఆశించిన మేరకు రాణించడం లేదు. జట్టులో ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, రసెల్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫాస్ట్‌బౌలర్లు ఉన్నా కోల్‌కతా పరాజయాల పాలవుతోంది. ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. రసెల్ అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులిస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు బ్యాట్‌తో రెచ్చిపోయే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో విఫలమవుతున్నాడు. దీంతో అతడిని పలు మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు.