IPL 2022 RCB VS KKR: దినేశ్ కార్తీక్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అచ్చం చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా కూల్ అని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ ప్రశంసించాడు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 128 పరుగులకే కుప్పకూలగా.. బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో బెంగళూరు కూడా తడబడినా.. చివర్లో దినేశ్ కార్తీక్ (14 నాటౌట్; 7 బంతుల్లో 1x4, 1x6), హర్షల్ పటేల్ (10 నాటౌట్; 6 బంతుల్లో 2x4) ధాటిగా ఆడి విజయాన్నందించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడాడు.
'ఈ విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న స్కోర్ల మ్యాచ్‌లో మేం సానుకూలంగా ఆడటానికి ప్రయత్నించాం. కానీ, కోల్‌కతా బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఈరోజు బంతి కాస్త ముందుగానే స్వింగ్ అవడం వల్ల పాటు బౌన్స్ కూడా అయింది. రెండు, మూడు రోజుల క్రితం ఇదే పిచ్‌పై 200 పరుగులు చేస్తే ఈరోజు 130 పరుగులే నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి పెద్ద లక్ష్యమేమీ లేకపోయినా వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఇక దినేశ్ కార్తీక్ గురించి చెప్పడానికి ఏం లేదు. అతడు ధోనీలాగే చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఏదైనా అవసరమైతే నేను జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి సహాయం తీసుకుంటా. మా టీమ్‌లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మా కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. జట్టుగా కలిసి ఉన్నారు. వాళ్లకు ఏదైనా ఆలోచన వస్తే నాతో పంచుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.