Rohit Sharma hugs fan: ప్రస్తుత ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ముంబయి 9వ స్థానంలో ఉండగా.. ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో తన హుందాతనంతో ప్రశంసలు అందుకున్నాడు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు హిట్ మ్యాన్. అదే సమయంలో సెక్యూరిటీ కళ్లు గప్పి ఓ అభిమాని రోహిత్ వైపు దూసుకొచ్చాడు. హగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. మామూలు రోజుల్లో రోహిత్ ఇచ్చేవాడేమో? అయితే కరోనా నేపథ్యంలో కాస్త పరిణతితో ఆలోచించాడు.
ఆ అభిమాని తనవైపు వస్తుండటం చూసి.. మైదానం వెళ్లిపోవాలని అతడికి సూచించాడు. అతడు మాత్రం హగ్ కోసం రోహిత్ వైపే వెళ్తున్నాడు. అయితే ఇది కరోనా టైం అని.. వర్చువల్ హగ్ ఇస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ ఫ్యాన్ కూడా చేతులు చాచి ఆనందంగా వెనక్కివెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అభిమానిని రోహిత్ డీల్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యాడు. రోహిత్ వైపు చూసి క్లాప్స్ కొడుతూ అభినందిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.