IPL 2022 records: ఐపీఎల్ టీ20 మెగా లీగ్ ఆద్యాంతం ఉత్కంఠగా సాగింది. టోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే అద్భుత ఆటతీరుతో విజేతగా నిలిచింది గుజరాత్. ఫైనల్లో రాజస్థాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు సరికొత్త రికార్డులను తమపేరుపై లిఖించుకున్నారు. ఐపీఎల్ 2022 సీజన్లో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
ఉమ్రాన్ అనుకుంటే ఫెర్గూసన్..
ఈ సీజన్లో హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగంతో బౌలింగ్ చేసిన ఆటగాడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో ఏకంగా 157 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఈ టోర్నీలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తర్వాత కూడా నిలకడగా 150 కిమీ వేగానికి పైగా బంతులేశాడు. దీంతో ఏకంగా టీమ్ఇండియాకే ఎంపికై అందరి ప్రశంసలు పొందాడు. ఇక ఆదివారం గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ముందువరకూ ఉమ్రాన్‌దే మెరుగైన రికార్డు. కానీ, తుదిపోరులో గుజరాత్ పేసర్ లాకీ ఫెర్గూసన్ 157.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసి ఉమ్రాన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పుడిదే ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలింగ్ ప్రదర్శన.
ఇన్ని సిక్సులు ఎప్పుడూ చూడలేదు..
టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తి అయినా.. ఈసారి నమోదైనన్ని సిక్సర్లు ఇంతకుముందెప్పుడూ నమోదుకాలేదు. ఈ సీజన్లో 162 మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసి మొత్తం 1,062 సిక్సర్లు బాదారు. అందులో జోస్ బట్లర్ అత్యధికంగా (45) సిక్సర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్ (30), క్వింటన్ డికాక్ (23) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే, ఇదివరకు అత్యధిక సిక్సులు కొట్టింది మాత్రం బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడు 2016లో 38 సిక్సర్లు సాధించాడు. 2018లో రిషభ్ పంత్ 37 సిక్సర్లు కొట్టాడు. కాగా, ఈ సీజన్లో పోటీపడింది 10 జట్లు కాబట్టి ఎక్కువ మ్యాచ్‌ల వల్ల సిక్సర్ల సంఖ్య పెరిగి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ, 2011, 2012, 2013 సీజన్లలోనూ 74, 76, 76 మ్యాచ్‌లు నిర్వహించారు. అప్పుడు కూడా 639, 731, 672 సిక్సర్లే వచ్చాయి. 2018లో మాత్రం అత్యధికంగా 872 సిక్సర్లు నమోదయ్యాయి. అప్పుడు 60 మ్యాచ్‌లే. దీంతో ఈసారి నమోదైన సంఖ్యే టోర్నీ చరిత్రలో అత్యధికంగా నమోదైన సిక్సర్ల రికార్డుగా నిలిచింది.
ఇమ్రాన్ తాహీర్‌ను మించిన చాహల్..
సహజంగా ప్రతి సీజన్లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ల జాబితాలో ప్రధానంగా పేస్ బౌలర్లే చోటు దక్కించుకుంటారు. తమ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తూ వికెట్లు సాధిస్తారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. తొలి రెండు స్థానాలను స్పిన్నర్లు కైవసం చేసుకోవడం విశేషం. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (27) వికెట్లతో ఈసారి టాప్ బౌలర్‌గా నిలవగా, బెంగళూరు స్పిన్నర్ వానిండు హసరంగ (26) వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో వీరిద్దరూ ఈ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ రికార్డులు నెలకొల్పిన స్పిన్నర్లుగా నిలిచారు. ఇంతకుముందు చెన్నై మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 2019లో (26) వికెట్లు తీసి ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. ఇప్పుడు చాహల్, హసరంగ అతడిని అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పారు. ఇక చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఈ సీజన్లో మొత్తం 16 వికెట్లు తీసి ఈ టోర్నీ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు 183 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. మలింగ 170, అమిత్ మిశ్రా 166, చాహల్ 166 వికెట్లతో కొనసాగుతున్నారు.