తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓపెనింగ్‌లో చెన్నై రికార్డు.. ఇతర జట్లు ఎలా ఉన్నాయంటే?

IPL 2022: ఐపీఎల్ ప్రస్తుత సీజన్​లో తీవ్రంగా విఫలమైన చెన్నై ఓపెనర్లు సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మాత్రం రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మరి మిగతా జట్ల ఓపెనర్లు ఎలా ఉన్నారు. ఆ టీమ్​ల పరిస్థితి ఏంటి?

IPL 2022 OPENING PARTNERSHIP
IPL 2022 OPENING PARTNERSHIP

By

Published : May 3, 2022, 12:28 PM IST

IPL 2022: బ్యాటింగ్‌లో శుభారంభం దక్కితే చాలు.. మిడిలార్డర్‌తోపాటు మిగతా ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తారు.. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితమై పెవిలియన్‌కు చేరితే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పరుగుల వేగం మందగిస్తుంది. అయితే ప్రస్తుత టీ20 లీగ్‌లో విజయాలపరంగా అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై అద్భుత రికార్డును సృష్టించింది. చెన్నై ఓపెనర్లు తొలి వికెట్‌కు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం (182) నిర్మించారు. మరి మిగతా జట్లలో ఓపెనింగ్‌ పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకుందాం..

చెన్నై:ప్రస్తుత సీజన్‌లో కేవలం మూడు విజయాలనే నమోదు చేసింది. గత సీజన్‌లో డుప్లెసిస్‌, రుతురాజ్‌ అద్భుత ఫామ్‌తో ఉండటంతో పరుగుల వరద పారించింది. అయితే ఈసారి మాత్రం ఓపెనింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. అయితే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి రికార్డు సృష్టించింది. రుతురాజ్‌ గైక్వాడ్-కాన్వే పోటీ పడుతూ బౌండరీల వర్షం కురిపించారు. ఇది కాకుండా ఒక్కసారి కూడానూ ఓపెనర్ల జోడీ కనీసం అర్ధ శతకం కూడా జోడించలేకపోయింది.

కోల్‌కతా:ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లిన కోల్‌కతా తర్వాత డీలా పడిపోయింది. వరుసగా ఐదు ఓటములతో కుదేలైన కోల్‌కతా ఓపెనింగ్‌ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటి వరకు 43 పరుగులే అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం. అదీ చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి పార్టనర్‌షిప్‌ లేదు. కోల్‌కతా ఓడిపోవడానికి ఇదీ ఓ కారణంగా చెప్పొచ్చు. ఆరోన్‌ ఫించ్‌, సునిల్ నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు సరిగ్గా రాణించలేకపోతున్నారు.

ముంబయి: వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడి.. తొమ్మిదో మ్యాచ్‌లో అదృష్టవశాత్తూ విజయం సాధించిన జట్టు ముంబయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో దిల్లీపై ముంబయి ఓపెనర్లు 67 పరుగులు జోడించారు. ఇప్పటి వరకు ముంబయికి ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. మరో రెండు సార్లు మాత్రమే అర్ధ శతక భాగస్వామ్యం నిర్మించారు. తొమ్మిది మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ 155 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 41 మాత్రమే. రోహిత్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ కూడా విఫలం కావడం ముంబయికి అడ్డంకిగా మారింది.

దిల్లీ: మ్యాచ్‌ తర్వాత మ్యాచ్‌ విజయం సాధిస్తూ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. దిల్లీకి కూడా ఓపెనింగ్‌ సమస్య వెంటాడుతోంది. లఖ్‌నవూతో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్-పృథ్వీ షా 67 పరుగులను జోడించారు. అలానే కోల్‌కతాపై 93 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. బెంగళూరుపై అర్ధ శతకం (50) సాధించారు. పంజాబ్‌తో జరిగిన స్వల్ప స్కోరు మ్యాచ్‌లో 83 పరుగులు జోడించారు. అయితే కీలకమైన సందర్భాల్లో ఓపెనర్లు ఇద్దరూ విఫలం కావడంతో గెలిచే మ్యాచ్‌లను కూడా ఓడిపోవాల్సి వచ్చింది. డేవిడ్‌ వార్నర్‌ వరుసగా మూడు అర్ధ శతకాలను నమోదు చేసినా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు.

బెంగళూరు: డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ వంటి సూపర్‌ బ్యాటర్లు ఉన్న బెంగళూరు ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే తొలి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో చెలరేగింది. అయితే ఆ తర్వాత నుంచి చేతులెత్తేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం మూడే మ్యాచుల్లో మాత్రమే అర్ధ శతక (50, 55, 50) భాగస్వామ్యాలను నిర్మించింది. డుప్లెసిస్‌, కోహ్లీ, అనుజ్‌ రావత్‌ ఓపెనర్లుగా వచ్చినా ఎలాంటి మార్పు లేదు.

పంజాబ్‌: యువ కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ నాయకత్వంలోని పంజాబ్‌ పెద్దగా రాణించడం లేదు. శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, లివింగ్‌స్టోన్‌ ఆడుతున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌ ఆ తర్వాత అటువంటి ఆటతీరును ప్రదర్శించలేదు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు 71 పరుగులను జోడించారు. ఆ తర్వాత ముంబయిపై 97 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ రెండు సందర్భాలు తప్ప మరోసారి ఇటువంటి ప్రదర్శన చేయలేదు.

లఖ్‌నవూ: కొత్త జట్టైన లఖ్‌నవూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పది మ్యాచ్‌లకుగాను కేవలం మూడింట్లో మాత్రమే ఓడి ఏడు విజయాలను నమోదు చేసింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్‌ డికాక్‌తో కలిసి రాహుల్ అప్పుడప్పుడు మాత్రమే శుభారంభాలను ఇవ్వగలుగుతున్నాడు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండటంతో లఖ్‌నవూ విజయాల బాట పడుతోంది. వీరిద్దరూ ఆడనప్పుడు ఓటమిబాట పట్టడం విశేషం. చెన్నైపై 99 పరుగులు, దిల్లీపై 73 పరుగులు, ముంబయిపై 52 పరుగులు జోడించారు.

గుజరాత్‌: దాదాపు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న జట్టు గుజరాత్‌. ఇప్పటి వరకు తొమ్మిదింట్లో ఒక్క మ్యాచ్‌ మినహా ఎనిమిది విజయాలను నమోదు చేసిన ఏకైక జట్టు. బౌలింగ్‌, మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ సహకారంతో మ్యాచ్‌లను నెగ్గడం విశేషం. గుజరాత్‌ అత్యధిక ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌ ఎంతంటే.. 69 పరుగులు. అదీ హైదరాబాద్‌పై ఓపెనర్లు సాధించారు. మరోసారి బెంగళూరు మీద 51 పరుగులను జోడించారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మరెప్పుడూ స్థిరంగా రాణించలేదు. అయినా విజయపరంపర కొనసాగిస్తూ దూసుకెళ్తోంది. శుభ్‌మన్‌ గిల్‌కు తోడు మ్యాథ్యూ వేడ్, సాహాలో ఒకరు ఓపెనింగ్‌ వస్తున్నారు.

రాజస్థాన్‌: ప్రస్తుత సీజన్‌లో అత్యధిక శతకాలతోపాటు టాప్‌ స్కోరర్‌గా ఉన్న బ్యాటర్‌ రాజస్థాన్‌ ఓపెనర్ జోస్ బట్లర్. ఇప్పటికే మూడు సెంచరీలను బాదేశాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓపెనర్లలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధిస్తుండటం రాజస్థాన్‌కు కలిసొస్తుంది. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌పై 58 పరుగులు జోడించారు. ఇంక బెంగళూరుపై 97 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుత సీజన్‌లోనే అత్యధిక స్కోరు (222/2) నమోదు చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు తొలి వికెట్‌కు 155 పరుగులను జోడించారు. ఇది రెండో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం.

హైదరాబాద్‌: బౌలింగ్‌నే నమ్ముకుని బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. వీటిల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ-కేన్ విలియమ్సన్‌ కీలక పాత్ర పోషించారు. చెన్నైపై 89 పరుగులు, గుజరాత్‌ మీద 64, బెంగళూరుపై 64, మరోసారి చెన్నైపై 58 పరుగులు జోడించారు. ప్రస్తుతం తొమ్మిది మ్యాచులకుగాను ఐదు గెలిచి, నాలుగింట్లో ఓడింది. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే కనీసం ఇంకో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:ఫస్ట్​ వైఫ్​ గ్రీన్​సిగ్నల్​.. ఘనంగా భారత మాజీ క్రికెటర్​ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్

ABOUT THE AUTHOR

...view details