IPL 2022 MI vs PBKS match preview: ఐపీఎల్లో ఛాంపియన్లుగా పేరున్న చెన్నై, ముంబయి జట్లు 15వ సీజన్లో నాలుగు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచాయి. అయితే.. ఎట్టకేలకు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. మరి.. చెన్నై దారిలోనే ముంబయి ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేస్తుందా? బుధవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి బోణీ కొట్టగలదా? అన్న ఆసక్తి ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం..
Mumbai indians strengthness and weekness: ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబయి తొలి విజయం కోసం ఆరాటపడుతోంది. ఓటముల ట్రెండ్‌ను మార్చాలని పట్టుదలతో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయికి నాలుగు వరుస ఓటములు పీడకలగానే చెప్పుకోవచ్చు. అయితే.. ఈ లీగ్‌ను నెమ్మదిగా ప్రారంభించి చివరకు కప్పు ఎగరేసుకుపోతుందనే పేరుంది. దానిని మళ్లీ రిపీట్ చేస్తుందని ముంబయి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సీజన్లుగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబయి ఈ సీజన్‌ను అత్యంత పేలవంగా ప్రారంభించింది. ముంబయి బ్యాటర్లు పెద్ద స్కోర్లు సాధించటంలో విఫలమవుతున్నారు.
గత మ్యాచ్‌లో ఒక్క సూర్యకుమార్ తప్ప ఎవ్వరూ రాణించలేకపోయారు. మరోవైపు.. బౌలింగ్ విభాగం సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచుల్లో ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాట్ ఝుళిపించి జట్టును విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నాడు. టాప్ఆర్డర్లో రోహిత్ శర్మ కీలకం. అలాగే.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు సైతం రాణిస్తేనే జట్టుకు పెద్ద స్కోర్ వస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్ కిరాన్ పొలార్డ్.. ఫామ్‌లో లేకపోవటం జట్టును కలవరపెడుతోంది.