Dewald Brevis Dismisses Kohli: శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. తొలుత ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులే చేసింది. స్వల్పలక్ష్యాన్ని సునాయాసంగా 3 వికెట్లు మాత్రమే ఛేదించింది ఆర్సీబీ. ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదుచేయగా.. ముంబయి వరుసగా నాలుగో మ్యాచ్ ఓడిపోయింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబయి ఆటగాడు, బేబీ ఏబీగా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19వ ఓవర్లో బౌలింగ్ వేసేందుకు వచ్చిన బ్రెవిస్ తొలి బంతికే విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీనిపై విరాట్ రివ్యూకు వెళ్లినా.. ఫలితం ముంబయికి అనుకూలంగానే వచ్చింది. దీంతో కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఐపీఎల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన తొలి ప్లేయర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. 2013 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గిల్లీ.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి హర్భజన్‌ను ఔట్ చేశాడు. గిల్‌క్రిస్ట్ కెరీర్లో తాను వేసిన తొలి, ఆఖరి బంతి ఇదే కావడం విశేషం.