IPL 2022: లఖ్‌నవూ ఔట్. రజత్ పటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12×4, 7×6) మెరుపు శతకం బాదడంతో ఎలిమినేటర్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లఖ్‌నవూపై విజయం సాధించింది. పటీదార్‌తో పాటు దినేశ్ కార్తీక్ (37 నాటౌట్; 23 బంతుల్లో 5×4, 1×6) మెరవడంతో మొదట బెంగళూరు 4 వికెట్లకు 207 పరుగులు సాధించింది. ఛేదనలో లఖ్‌నవూ గట్టిగానే ప్రయత్నించింది. అయితే రాహుల్ (79; 58 బంతుల్లో 3×4, 5×6), దీపక్ హుడా (45; 26 బంతుల్లో 1×4, 4×6) పోరాడినా 6 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది. హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్ (1/25) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బెంగళూరు ఫైనల్లో చోటు కోసం క్వాలిఫయర్-2లో శుక్రవారం రాజస్థాన్‌తో తలపడుతుంది.
రాహుల్ పోరాడినా..:ఛేదనలో డికాక్ తొలి ఓవర్లోనే వెనుదిరిగినా మరో ఓపెనర్ రాహుల్ నిలబడ్డాడు. అయిదో ఓవర్లో లఖ్‌నవూ స్కోరు 41 వద్ద మనన్ వోహ్రా (19) ఔటయ్యాడు. అయితే దీపక్ హుడాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రాహుల్ వీలైనప్పుడు బ్యాట్ ఝుళిపించాడు. కానీ హుడా ఎక్కువ దూకుడును ప్రదర్శించాడు. భారీ లక్ష్య ఛేదనలో అవసరమైనంత వేగంగానైతే పరుగులు రాలేదు. 13 ఓవర్లలో స్కోరు 109/2. సాధించాల్సిన రన్‌రేట్ 14కుపైనే ఉన్నా.. రాహుల్‌తో పాటు హుడా నిలదొక్కుకుని ఉండడంతో లఖ్‌నవూ తన అవకాశాలపై నమ్మకంగానే ఉంది. అక్కడి నుంచి రాహుల్ జోరు పెంచాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రాహుల్, హుడా చెరో సిక్స్ బాదారు. హసరంగ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన హుడా మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. కానీ అదే ఓవర్లో హుడా ఔటయ్యాడు. హసరంగ తర్వాతి ఓవర్లో రాహుల్ 6, 4 కొట్టడంతో చివరి మూడు ఓవర్లలో లఖ్‌నవూకు 41 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసాధ్యమైన సమీకరణమేమీ కాదు. కానీ 18వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చి స్టాయినిస్‌ను ఔట్ చేసిన హర్షల్.. లఖ్‌నవూపై ఒత్తిడి పెంచాడు. 19వ ఓవర్లో హేజిల్‌వుడ్ మూడు వైడ్లు వేసినా.. వరుస బంతుల్లో రాహుల్, కృనాల్‌ను ఔట్ చేసి లఖ్‌నవూ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది.
దంచికొట్టిన పటీదార్:బెంగళూరు ఇన్నింగ్స్‌లో రజత్ పటీదార్ ఆటే హైలైట్. ఆ జట్టు అంత భారీ స్కోరు సాధించిందంటే కారణం అతడి విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలే. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డ పటీదార్ లఖ్‌నవూ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మరోవైపు నుంచి వికెట్లు పోతున్నా.. ఎక్కడా అతడి విధ్వంసం ఆగలేదు. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిపోయాడు. డుప్లెసిస్‌ను మోసిన్ ఔట్ చేయడంతో తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన పటీదార్.. ఏ దశలోనూ తగ్గలేదు. మరో ఓపెనర్ కోహ్లిలో దూకుడు లేకున్నా ఆరు ఓవర్లకు బెంగళూరు 52/1తో ఉందంటే అది పటీదార్ వల్లే. చమీర బంతిని ఓ బలమైన షాట్‌తో బౌండరీ దాటించి ఖాతా తెరిచింది మొదలు.. బంతిని మైదానం నలువైపులా కసిదీరా బాదేశాడు. పటీదార్ వరుసగా 4, 4, 6, 4 దంచేయడంతో ఆరో ఓవర్లో కృనాల్ పాండ్య ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడలేకపోయిన కోహ్లి (25; 24 బంతుల్లో 2×4).. పదో ఓవర్లో అవేష్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. కానీ పటీదార్ జోరు కొనసాగించాడు. అవేష్ బౌలింగ్‌లోనే సిక్స్ కొట్టిన అతడు.. చమీర వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రెండు ఫోర్లు సాధించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్లో దినేశ్ కార్తీక్ తోడయ్యేంత వరకు జట్టు బాధ్యతలు అతడొక్కడి మీదే. ఈ లోపు మ్యాక్స్‌వెల్ (9), లొమ్రార్ (14) కూడా పెవిలియన్ బాట పట్టారు. రజత్ పటీదార్ జోరు మీదున్నా.. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 117/4తో ఉన్న బెంగళూరు 200 దాటుతుందని ఎవరూ ఊహంచలేదు. అయితే పటీదార్‌తో కార్తీక్ కలిశాక స్కోరు బోర్డు జెట్ వేగాన్ని అందుకుంది. లఖ్‌నవూ బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇటు పటీదార్.. అటు కార్తీక్ బాదుడే బాదుడు. బంతి ఎక్కువగా బౌండరీ ఆవలే కనిపించింది. 16వ ఓవర్ నుంచి మొదలైంది ఊచకోత. పూనకమొచ్చినట్లు విరుచుకుపడ్డ పటీదార్.. బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు దంచేసి 92కు చేరుకున్నాడు. 18వ ఓవర్లో మోసిన్ బౌలింగ్‌లో ఓ షార్ట్ బాల్‌ను సిక్స్‌కు పుల్ చేసి శతకం (49 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కార్తీక్ కూడా అతడితో పోటీపడి కొట్టాడు. 17వ ఓవర్లో (అవేష్ ఖాన్) మూడు ఫోర్లు దంచాడు. చమీర వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతడు సిక్స్, ఫోర్... పటీదార్ సిక్స్, ఫోర్ బాదేశారు. కార్తీక్ ఆఖరి ఓవర్లో మరో ఫోర్ కొట్టాడు. ఆఖరి అయిదు ఓవర్లలో బెంగళూరు ఏకంగా 84 పరుగులు పిండుకుంది. పటీదార్, కార్తీక్ జంట అభేద్యమైన అయిదో వికెట్‌కు 92 పరుగులు జోడించింది. లఖ్‌నవూ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం పటీదార్‌కు కలిసొచ్చింది.
ఇదీ చూడండి:IPL 2022: 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'