IPL 2022 KKR Vs DC: ఐపీఎల్ 15వ సీజన్లో వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది కోల్‌కతా జట్టు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ లీగ్‌లో దిల్లీ నాలుగో విజయం నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42), లలిత్ యాదవ్ (22), రోవ్‌మన్ పావెల్ (33*), అక్షర్ పటేల్ (24) రాణించారు.
17 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకున్న దిల్లీని వార్నర్, లలిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించారు. అయితే కోల్‌కతా బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీయడంతో రేసులోకి వచ్చింది. అయితే అక్షర్ పటేల్‌తోపాటు పావెల్ కోల్‌కతా ఆశలను వమ్ము చేశాడు. ఇంకో 29 పరుగులు జోడించి అక్షర్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వచ్చిన శార్దూల్ (8*) తో కలిసి పావెల్ మరో వికెట్ పడనీయకుండా దిల్లీని విజయతీరాలకు చేర్చాడు. బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3.. హర్షిత్ రాణా, సునిల్ నరైన్ చెరో వికెట్ తీశారు.