IPL 2022: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పోటీపడటం అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. టీ20 లీగ్ వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం యువ క్రికెటర్లకు వచ్చిందన్నాడు. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ తరఫున ఆడుతున్న అతడు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"నిజం చెప్పాలంటే టీ20 లీగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎదుర్కోవడం చాలా ఇష్టం. వారిద్దరూ నాణ్యమైన బ్యాటర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో వారితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా. దేశవాళీ టీ20 లీగ్‌లో మాత్రం ప్రత్యర్థిగా బరిలోకి దిగా. అందుకే ఆ ఇద్దరితో పోటీ పడటం నాకెంతో నచ్చింది. అంతేకాకుండా వారిద్దరూ బౌలర్లకు లొంగేందుకు ఇష్టపడరు. అందుకే కోహ్లీ, రోహిత్‌తో పోటీ అంటే ఇష్టపడతా"
-అశ్విన్, రాజస్థాన్ క్రికెటర్