IPL 2022 Dwayne Bravo Record: టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌ను ఔట్ చేయడం వల్ల తన జీవితమే మారిపోయిందన్నాడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో. తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన అతడు 2006లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో భాగంగా చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు.
జమైకాలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఒక పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ 197 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమైన సమయంలో.. ఆఖరి ఓవర్లో రెండు, మూడు బంతులను యువరాజ్ సింగ్ బౌండరీకి తరలించి సమీకరణాన్ని మూడు బంతుల్లో రెండు పరుగులుగా మార్చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు నాలుగో బంతికి యువరాజ్ బౌల్డయ్యాడు. దీంతో భారత్‌కి ఓటమి తప్పలేదు.
"టీమ్ఇండియా అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. విజయానికి రెండు పరుగుల దూరంలో ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ (93) ఉన్నాడు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి డిప్పర్ బంతితో యువరాజ్‌ను ఔట్ చేయడం వల్ల అందరి దృష్టి నాపై పడింది. ఆ ఒక్క బంతితో నా జీవితమే మారిపోయింది. నా టీ20 కెరీర్‌కు పునాదిగా నిలిచింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ బంతే ఇప్పటికీ నా ఫేవరెట్"
-డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ ఆల్‌రౌండర్