తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫినిషర్​గా అదరగొడుతున్న డీకే... మహీని గుర్తు తెచ్చేలా... - నిదహాస్ ట్రోఫీ

IPL 2022 Dinesh Karthik: మహేంద్రసింగ్‌ ధోనీ.. క్రికెట్‌ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతడు క్రీజులో ఉంటే చాలు. ఎలాగైనా మ్యాచ్‌ను గెలిపిస్తాడనే విశ్వాసం. సరిగ్గా ఇప్పుడు అదే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు బెంగళూరు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్ కార్తీక్‌. చాలా కాలంగా సరైన ప్రదర్శన లేక అటు అభిమానులు, ఇటు క్రికెట్‌ వర్గాలు ఆశలు వదులుకున్న వేళ బెంగళూరు తరఫున అదరగొడుతున్నాడు.

IPL 2022 Dinesh Karthik
IPL 2022 Dinesh Karthik

By

Published : Apr 18, 2022, 3:31 PM IST

IPL 2022 Dinesh Karthik: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈ ఐపీఎల్ సీజన్​లో అదరగొడుతున్నాడు. ఫినిషింగ్ రోల్​ను చక్కగా పోషిస్తూ బెంగళూరుకు మరిచిపోలేని విజయాలను అందిస్తున్నాడు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు తెచ్చేలా ఫినిషర్​గా రాణిస్తున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోనీకన్నా ముందే వచ్చాడు. అయినా అతడికి సరైన గుర్తింపు దక్కలేదు. 2004లోనే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసినా 2005లో మహీ వచ్చాక చోటు కోల్పోయాడు. దీంతో అప్పుడప్పుడూ తళుక్కున మెరుస్తూ నేనింకా జట్టులోనే ఉన్నానని గుర్తుచేసేవాడు. అయితే, అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో రాణించిన డీకే తమిళనాడుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

.

Nidahas trophy final:అయితే, నాలుగేళ్ల కిందట నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. దాంతో తన కెరీర్‌ ఆరంభించిన 15 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి 2019 వన్డే ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీకే చివరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 34 పరుగులు అవసరం కాగా 8 బంతుల్లో 2x4, 3x6 సాయంతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా రూబెల్‌ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టిన అతడు.. మ్యాచ్‌ ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్‌తో ఘన విజయాన్ని అందించాడు. దీంతో అప్పుడే తొలిసారి డీకే తనలోని అత్యుత్తమ ఫినిషర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు.

.

2019 సెమీఫైనల్‌తో ఖేల్ ఖతం..:ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే డీకే 2019 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఉన్నా రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. తొలుత వీరిద్దరినీ ఎంపిక చేసిన సెలెక్షన్‌ కమిటీ.. టోర్నీ మధ్యలో ఒక ఆటగాడు గాయపడటంతో రిషభ్‌ పంత్‌ను మూడో కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా తీసుకుంది. అయితే, ఆ టోర్నీలో డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన సెమీఫైనల్‌ పోరులో టీమ్‌ఇండియా అవకాశం ఇచ్చింది. అందులో ధోనీ, పంత్‌ ఉన్నా కూడా డీకేను అదనపు బ్యాట్స్‌మన్‌గా భావించింది. కానీ, అతడిపై పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేక విఫలమయ్యాడు. వర్ష ప్రభావం కారణంగా రెండు రోజులు సాగిన ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఆ పోరులో టాప్‌ ఆర్డర్‌తో పాటు పంత్‌ (32), కార్తీక్‌ (6) విఫలమవ్వగా.. ధోనీ (50), జడేజా (77) ఏడో వికెట్‌కు తీవ్రంగా శ్రమించారు. వాళ్లిద్దరూ మ్యాచ్‌ను గెలిపించేంత పనిచేసినా చివరికి ఓటమి తప్పలేదు. దీంతో కార్తీక్‌కు టీమ్‌ఇండియా తరఫున అదే ఆఖరి మ్యాచ్‌గా మారిపోయింది.

.

ఆశలు వదులుకొనే స్థాయికి..:మరోవైపు భారత టీ20 లీగ్‌లోనూ తమకు ఫినిషర్‌గా బాగా పనికొస్తాడని ఆశించిన కోల్‌కతాకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. 2018 వేలంలో కార్తీక్‌ను కొనుగోలు చేయగా.. ఆ సీజన్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 498 పరుగులు సాధించి తొలిసారి ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తర్వాత ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారడమే కాకుండా కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. సారథిగా పెద్దగా విజయవంతం కాకపోయినా కోల్‌కతా వేచి చూసింది. అదే సమయంలో బ్యాట్స్‌మన్‌గానూ చెప్పుకునే స్థాయి ప్రదర్శన లేకపోయింది. దీంతో గత మూడు సీజన్లలో వరుసగా 253, 169, 223 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కోల్‌కతా కెప్టెన్‌గానూ తప్పుకొని బ్యాట్స్‌మన్‌గా కొనసాగాడు. అయినా, తన ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా ఆశలు వదులుకుంది. దీంతో ఈ సీజన్‌కు ముందు కోల్‌కతా వదిలేసుకుంది. అయితే, కార్తీక్‌ పని అయిపోయిందని అనుకున్నవాళ్లకు ఇప్పుడు అతడు చుక్కలు చూపిస్తున్నాడు.

.
.

బెంగళూరు నమ్మకాన్ని కాపాడుకొని..:ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో బెంగళూరు అతడిని కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో రూ.5.5 కోట్ల ధరకు దక్కించుకుంది. అదేరోజు ఆ జట్టు కోచ్‌ సంజయ్‌ బంగర్‌ డీకేకు ఫోన్‌ చేసి ఈసారి బెంగళూరు తరఫున ఫినిషర్‌గా ఆడతావని చెప్పాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న అతడు ఇప్పుడు (32*, 14*, 44*, 7*, 34, 66*) వరుసగా మెరుస్తూ.. ఆ జట్టు విజయాల్లో ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తున్నాడు. మరోవైపు ఈ వేలానికి ముందు మళ్లీ టీమ్‌ఇండియాలో ఆడాలనుకున్న కోరికను ఈ సంచలన బ్యాటింగ్‌తో నిజం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం నిబద్ధతతో కొనసాగుతున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. వికెట్ల వెనుక కీపర్‌గా ఉంటూనే.. బౌలర్లకు, ఫీల్డర్లకు అవసరమైన సూచనలు చేస్తున్నాడు. దీంతో అటు బ్యాట్స్‌మన్‌గానే కాకుండా.. కీపర్‌గా, ఫినిషర్‌గా రాణిస్తూ బెంగళూరులో ధోనీలా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఆ జట్టు సారథి ఫా డుప్లెసిస్‌ కూడా చెప్పాడు. డీకే.. ధోనీలా ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడని అన్నాడు. అయితే, కార్తీక్‌ మున్ముందు కూడా ఇలాగే ఆడితే ఈసారి బెంగళూరు కల నెరివేరినట్టే.

.

ఇదీ చదవండి:'హాల్​ ఆఫ్​ ఫేమ్'​లో చోటు.. ఈ రెజ్లర్​ చాలా హాట్​!

ABOUT THE AUTHOR

...view details