IPL 2022 DC VS MI:టీ20 లీగ్ సీజన్‌లో దిల్లీ కథ ముగిసింది. శనివారం చావోరేవోతేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ముంబయి చేతిలో ఓడింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ జట్టులో పావెల్ (43; 34 బంతుల్లో 1×4, 4×6), పంత్ (39; 33 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో బుమ్రా (3/25) విజృంభించాడు. రమణ్‌దీప్ (2/29) కూడా మెరిశాడు. ఛేదనలో ముంబయి 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇషాన్ కిషన్ (48; 35 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్ (34; 11 బంతుల్లో 2×4, 4×6) సత్తాచాటారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ (2/32), నోకియా (2/37) ఆకట్టుకున్నారు.
పడుతూ లేస్తూ..:ఛేదనలో ముంబయికి ఆరంభంలోనే దెబ్బ పడింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిపడ్డ రోహిత్ (2) త్వరగానే పెవిలియన్ చేరాడు. అతణ్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తూ బంతులతో ఖలీల్ (0/24) హడలెత్తించాడు. బంతిని లోపలికి, బయటకు స్వింగ్ చేస్తూ, వికెట్లకు నేరుగా వేస్తూ అసలు రోహిత్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. చివరకు నోకియా బౌలింగ్‌లో మిడాన్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్రెవిస్ (37)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను ఇషాన్ తీసుకున్నాడు. ఈ జోడీ మధ్యలో కాస్త నెమ్మదించినా ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు చెలరేగింది. ముఖ్యంగా బ్రెవిస్ తనదైన శైలి షాట్లతో ఆకట్టుకున్నాడు. కుల్‌దీప్ (1/33) ఓవర్లో అతను వరుసగా 6, 4 బాదితే.. ఇషాన్ ఓ సిక్సర్ రాబట్టాడు.
ఇక ముంబయి ఇన్నింగ్స్ వేగం అందుకుంటుందని అనుకునేలోపే ఇషాన్‌ను కుల్‌దీప్ బుట్టలో వేసుకున్నాడు. అదే ఓవర్లో బ్రెవిస్ క్యాచ్‌ను పంత్ వదిలేశాడు. కానీ ఆ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం లేకుండా అతని ఇన్నింగ్స్‌కు శార్దూల్ కొద్దిసేపటికే తెరదించాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి బంతి పంత్ చేతిలో పడింది. అప్పీల్ చేస్తే అంపైర్ నాటౌటిచ్చాడు. కానీ పంత్ సమీక్ష కోరేందుకు నిరాకరించాడు. డేవిడ్ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి ఓవర్లో తిలక్ (21) ఓ సిక్సర్, డేవిడ్ ఓ ఫోర్ కొట్టడంతో విజయ సమీకరణం 4 ఓవర్లలో 46 పరుగులుగా మారింది. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఖలీల్ వేసిన 17వ ఓవర్లో డేవిడ్ ఓ సిక్సర్, ఫోర్ బాదాడు. తిలక్ ఓ ఫోర్ కొట్టడంతో సాధించాల్సిన నెట్ రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. ఇక శార్దూల్ బౌలింగ్‌లో డేవిడ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ ముంబయి వైపు మొగ్గింది. అదే ఓవర్లో డేవిడ్ ఔటైనా.. రమణ్‌దీప్ (13 నాటౌట్) పని పూర్తిచేశాడు.
బుమ్రా జోరు..:కీలక మ్యాచ్‌లో దిల్లీ టాప్‌ఆర్డర్ చేతులెత్తేసింది. ఆ జట్టుకు మరోసారి పేలవ ఆరంభమే దక్కింది. ముంబయి బౌలర్ల ధాటికి టపాటపా వికెట్లు కోల్పోయింది. కొత్త బంతితో బుమ్రా, సామ్స్ (1/30) ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. వార్నర్ (5)ను ఔట్ చేసిన సామ్స్ వికెట్ల పతనానికి తెరలేపగా.. ఆ తర్వాత బుమ్రా చెలరేగాడు. తన బౌలింగ్ వైవిధ్యానికి కచ్చితత్వాన్ని జోడించి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తన వరుస ఓవర్లలో మిచెల్ మార్ష్ (0), పృథ్వీ షా (24)ను పెవిలియన్ చేర్చాడు. టైఫాయిడ్ నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన షా జోరు మీద కనిపించాడు. కానీ ఓ బుల్లెట్ లాంటి బౌన్సర్‌ను అంచనా వేయలేక వికెట్ కీపర్ ఇషాన్ పట్టిన చక్కటి క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే సర్ఫరాజ్ (10) కూడా ఔటైపోవడంతో పది ఓవర్లకు దిల్లీ 55/4తో నిలిచింది.