తెలంగాణ

telangana

ETV Bharat / sports

Mumbai: ఇంకెప్పుడో ముంబయి బోణీ? అలా చేస్తుందా?

Mumbai: ఐపీఎల్​ 2022లో ప్రత్యర్థులు మారినా ముంబయి ఇండియన్స్​ను పరాజయమే పలకరిస్తోంది. లీగ్​ దశలో వరుసగా ఏడో మ్యాచ్​లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన ఆ జట్టు ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​​ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది! ఇంతకీ ముంబయికి ఏమైంది? బోణీ ఎప్పటికి?

mumbai indians
csk vs mi

By

Published : Apr 22, 2022, 6:51 AM IST

Mumbai: టీ20 మోగా టోర్నీ 15వ సీజన్‌.. తన తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ముంబయి పరాజయం పాలైంది. ఓటమితో సీజన్‌ను ఆరంభించడం ఆ జట్టుకు అలవాటే కదా అని అంతా అనుకున్నారు. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడింది. నెమ్మదిగా సీజన్‌ను మొదలెట్టి ఆ తర్వాత పుంజుకోవడమే ముంబయి శైలి అని అభిమానులు నమ్మకంతోనే ఉన్నారు. కానీ మూడు, నాలుగు, అయిదు.. ఇలా మ్యాచ్‌లు సాగుతున్నా జట్టు బోణీ కొట్టడడం లేదు. ప్రత్యర్థులు మారినా పరాజయమే పలకరిస్తోంది. చివరకు ఏడో మ్యాచ్‌లోనూ చిత్తుచిత్తుగా ఓడడం వల్ల ఇక ఆ జట్టు ప్లేఆఫ్స్‌ దారులు పూర్తిగా మూసుకుపోయినట్లే!

మిగతా ఏడు మ్యాచ్‌ల్లో అన్ని గెలిచినా ముందంజ వేయడం కష్టమే. ప్రస్తుతం జట్టు ఉన్న పరిస్థితుల్లో మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తుందనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే అయిదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి. సీజన్‌ మొదలయ్యే ముందు కచ్చితంగా ఫేవరెట్ల జాబితాలో ఉంటుంది. అలాంటిది ఇప్పుడా జట్టుకు ఏమైంది? మెగా వేలం కారణంగా జట్టు మారిందని, సంధి దశ నడుస్తోందని ముంబయి ఆటగాళ్లు అంటున్నారు. వేలంతో అన్ని జట్ల రూపురేఖలు మారాయి. కానీ మిగతా జట్ల పరిస్థితి ఇలా లేదు కదా. ఇంకా చెప్పాలంటే రోహిత్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, పొలార్డ్‌, బుమ్రా.. ఇలా ముంబయి ప్రధాన ఆటగాళ్ల బృందం ఆ జట్టుతోనే ఉంది. కానీ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైఫల్యమే జట్టు కొంపముంచుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, ఇషాన్‌ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. రోహిత్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇక వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఇషాన్‌ ఒత్తిడికి చిత్తవుతున్నాడు. సూర్యకుమార్‌, తిలక్‌, బ్రేవిస్‌ లాంటి ఆటగాళ్లు అదరగొడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. అందుకు ప్రధాన కారణం పస లేని బౌలింగ్‌ అని చెప్పాలి. ఆ జట్టు ప్రధానాస్త్రం బుమ్రా వైఫల్యం పెను ప్రభావం చూపుతోంది. వెరసి జట్టుకు ఓటములు తప్పడం లేదు. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ముంబయి బోణీ ఇంకెప్పుడు కొడుతుందో! కొన్ని విజయాలతో కాస్త గౌరవప్రదంగానైనా సీజన్‌ను ముగిస్తుందా? అన్నదే చూడాలి.

ఇదీ చూడండి:MI vs CSK: లాస్ట్ ఓవర్లో చెలరేగిన ధోనీ.. ముంబయికి వరుసగా ఏడో ఓటమి

ABOUT THE AUTHOR

...view details