తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ధోనీ సహా సీనియర్ల విశ్వరూపం.. కుర్రాళ్లు కేక.. కానీ.. - ఐపీఎల్​ 2022

IPL 2022: ఐపీఎల్​లో మంగళవారం (మార్చి 29) నాటికి ప్రతీ జట్టూ సీజన్​లో తొలి మ్యాచ్​ను ఆడేశాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లో ఎంఎస్​ ధోనీ సహా పలువురు సీనియర్లు ఫామ్​లోకి వచ్చి ఫ్యాన్స్​లో జోష్​ నింపారు. మరికొందరు కుర్రాళ్లూ అదరగొట్టారు. నిరాశ పరిచిన జట్లూ ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన లీగ్ విశేషాలపై ఓ లుక్కేయండి.

IPL 2022
IPL 2022 teams

By

Published : Mar 30, 2022, 1:40 PM IST

IPL 2022: మెగా టీ20 టోర్నీలో పది జట్లూ తలా ఒక్కో మ్యాచ్‌ ఆడేశాయి. కొత్త కుర్రాళ్లు అదరగొట్టగా.. సీనియర్లు సైతం తమ విశ్వరూపం చూపించారు. చాన్నాళ్ల తర్వాత వారు ఫామ్‌లోకి రావడం వల్ల అభిమానులు ఆనంద పడుతున్నారు. కొన్ని జట్లు అనుకున్న విధంగా విజయాలు సాధించలేకపోగా.. మరికొన్ని మాత్రం అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాయి. మరి ఏ జట్ల ప్రదర్శన ఎలా ఉంది.. ఎవరు అదుర్స్‌ అనిపించారో ఓసారి చూసేయండి.

ధోనీ.. ధోనీ.. మారుమోగిన పేరు :గతేడాది ఛాంపియన్‌ చెన్నై ప్రయాణం ఈసారి ఓటమితో ఆరంభమైంది. అయినా అభిమానులను ఓ విషయం సంతోష పెట్టింది. అదేంటంటే ఫినిషర్‌, 'మిస్టర్ కూల్' ఎంఎస్‌ ధోనీ ఫామ్‌లోకి రావడం. అవును మరి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. గత సీజన్లలో పెద్దగా ఫామ్‌లో లేని ధోనీ (50 నాటౌట్) తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం సాధించడం విశేషమే కదా.

మహేంద్ర సింగ్​ ధోనీ

అయితే చెన్నై బౌలర్లు విఫలం కావడం వల్ల కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ (0), కాన్వే (3), శివమ్‌ దూబె (3) ఘోరంగా విఫలమయ్యారు. ఉతప్ప (28), రాయుడు (15), రవీంద్ర జడేజా (26*) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలోనే 133/4 స్కోరు చేసి విజయం సాధించింది.

ధరకు ఇప్పుడే న్యాయం చేశారు : ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయికే దిల్లీ ధమ్​కీ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 177/5 స్కోరు చేసి దిల్లీకి భారీ లక్ష్యమే నిర్దేశించింది. అయితే బ్యాటర్లు పృథ్వీ షా (38), సీఫెర్ట్ (21), లలిత్ యాదవ్‌ (48*), శార్దూల్ ఠాకూర్‌ (22), అక్షర్ పటేల్‌ (38*) సూపర్‌ బ్యాటింగ్‌తో దిల్లీ 18.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయం సాధించింది.

ఇషాన్​ కిషన్​

యువ బ్యాటర్ లలిత్ యాదవ్‌ అర్ధశతకం చేయకున్నా.. చివరి వరకూ క్రీజ్‌లోనే నిలదొక్కుకుని దిల్లీని విజయతీరాలకు చేర్చాడు. లలిత్ యాదవ్‌ను దిల్లీ రూ. 65 లక్షలకే సొంతం చేసుకుంది. సీనియర్లు మన్‌దీప్‌ సింగ్‌ (0), రిషభ్‌ పంత్ (1), రోవ్‌మన్‌ పావెల్ (0) ఘోరంగా విఫలమైన పిచ్‌పై ఎంతో ఓర్పుతో రాణించాడు. ముంబయి తరఫున ఇషాన్‌ కిషన్‌ (81*) ఓపెనర్‌గా వచ్చి ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు బ్యాటింగ్‌ చేయడం విశేషం. అతడినెందుకు ముంబయి భారీ ధర (రూ. 15.25కోట్లు)కు కొనుగోలు చేసిందో తొలి మ్యాచ్‌లోనే నిరూపించాడు.

భారీ స్కోర్లు.. కొత్త సారథి అదుర్స్‌ :బెంగళూరు సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌పై ఒత్తిడి ఉంటుందనే భ్రమలను తొలగించాడు డుప్లెసిస్ (88)‌. గత సీజన్‌లో చెన్నై తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్‌లను ఆడిన డుప్లెసిస్‌ను.. ఈసారి ఆ జట్టు యాజమాన్యం రిటెయిన్‌ చేసుకోలేదు. అయితే అలా ఎందుకు చేయలేకపోయామా అని చెన్నై అనుకునేలా డుప్లెసిస్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు. బెంగళూరు తరఫున భారీ ఇన్నింగ్స్‌తో కొత్త సీజన్‌ను ఆరంభించాడు.

ఫాఫ్ డుప్లెసిస్​

డుప్లెసిస్‌ వ్యక్తిగతంగానూ రాణించి ప్రత్యర్థి ముందు బెంగళూరు భారీ లక్ష్యం (205/2) నిర్దేశించింది. అయితే పంజాబ్‌ బ్యాటర్లు సమష్ఠిగా రాణించడం వల్ల 19 ఓవర్లలోనే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. స్టార్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (41*), కార్తిక్ (32*) ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు సానుకూలాంశం. అయితే బౌలింగ్‌ విభాగం దారితప్పడం వల్ల ఓటమి తప్పలేదు. పంజాబ్‌ తరఫున భారీ షాట్లు ఆడే సత్తా ఉందని భానుక రాజపక్స (43), ఓడియన్‌ స్మిత్ (25*), శిఖర్ ధావన్‌ (43) నిరూపించారు.

ఫామ్‌లోకి హార్దిక్‌.. రాణించిన కొత్త కుర్రాడు : ఈ సారి సీజన్‌లో రెండు కొత్త జట్లు వచ్చి చేయాయి. అయితే హాట్‌ టాపిక్‌గా మారిన గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.. వికెట్‌ తీయకపోయినా చాలా రోజుల తర్వాత తొలిసారి పూర్తి కోటా బౌలింగ్‌ (4-0-37-0) వేశాడు. అలానే బ్యాటింగ్‌లోనూ 33 పరుగులు చేసి సోదరుడు కృనాల్‌ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌కు చేరాడు.

ఆయుష్ బదోని

లఖ్‌నవూ తరఫున తొలిసారి టీ20 లీగ్ ఆడుతున్న ఆయుష్ బదోని (54) అరంగేట్రంలోనే అర్ధశతకం సాధించి ఔరా అనిపించాడు. 29/4 స్కోరుతో లఖ్‌నవూ ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన ఆయుష్.. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌ దీపక్‌ హుడా (55)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ కలిసి 87 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దీపక్‌ ఔటైనా.. కృనాల్‌ (21*)తో కలిసి కీలక పరుగులను రాబట్టి గుజరాత్‌ ఎదుట మంచి లక్ష్యాన్నే (158/6) ఉంచేలా చేశాడు.

హైదరాబాద్‌ కొంపముంచిన 'నో బాల్స్': మంచి ఊపు మీదున్న బ్యాటర్లను అద్భుతమైన బంతితో ఔట్‌ చేస్తే ఆ కిక్కే వేరు.. ఆ బాల్‌ 'నో బాల్‌' అయితే.. బ్యాటర్లను ఆపడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌కు వచ్చింది. తొలి ఓవర్‌లోనే రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ (35)ను ఔట్‌ చేసే అవకాశం అలానే వచ్చి పోయింది. భువనేశ్వర్ వేసిన బంతి బట్లర్ అంచున తాకుతూ కీపర్‌ చేతిలో పడింది. అయితే అది 'నో బాల్'గా తేలడం వల్ల బట్లర్‌ బతికి పోయాడు. అప్పుడు బట్లర్‌ స్కోరు సున్నా. జీవదానం లభించడం వల్ల తర్వాత కాసేపు బట్లర్ చెలరేగిపోయాడు. ఇదే రాజస్థాన్‌కు ఊపిరి పోసింది. మరోసారి ఉమ్రాన్‌ బౌలింగ్‌లోనూ క్యాచ్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి బట్లర్‌ తప్పించుకున్నాడు. అదీ 'నో బాలే'.

మార్‌క్రమ్

హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌లో విఫలం కావడం వల్ల రాజస్థాన్‌ 210/6 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 149/7 స్కోరుకే పరిమితమై 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. టాప్‌ ఆర్డర్‌లో కేన్ విలియమ్సన్ (2), అభిషేక్ శర్మ (9), రాహుల్ త్రిపాఠి (0), నికోలస్​ పూరన్ (0) సహా అబ్దుల్ సమద్‌ (4) దారుణంగా విఫలమయ్యారు. అప్పటికే ఓటమి ఖాయమైనా మార్‌క్రమ్ (57*), వాషింగ్టన్ సుందర్ (40: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెఫెర్డ్‌ (24) రాణించడమే హైదరాబాద్‌ అభిమానులకు ఆనందం కలింగించే అంశం. టాప్‌ ఆర్డర్‌ను మార్చుకొని, బౌలింగ్‌లో అదనపు పరుగులను నియంత్రించుకుంటే మున్ముందు మ్యాచుల్లో హైదరాబాద్‌కు తిరుగుండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:IPL 2022: జోరు మీదున్న కోల్​కతా.. తొలి విజయంపై ఆర్సీబీ కన్ను

ABOUT THE AUTHOR

...view details