Mumbai Indians: ఐపీఎల్ 2022లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై అభిమానులను నిరాశ పరిచింది ముంబయి ఇండియన్స్. అయితే 2014లోనూ ఇలానే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడింది.. ఇంకేం పుంజుకొంటుందిలే అనుకుని ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్ అయ్యాయి.. ఇదే అదనుగా చెన్నై, కోల్‌కతా మినహా ఇతర జట్లపై వరుసపెట్టి విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్ చేరుకుంది రోహిత్ సేన. ఇప్పుడు కూడా మరోసారి ముంబయికి అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఈలోగా అప్పుడేం జరిగింది.. ఎలా రాణించింది.. ఇప్పుడు ఇలా కావడానికి కారణాలేంటో ఓసారి విశ్లేషిద్దాం..
వరుసగా ఓడినా.. టాప్-4లోకి:ఏ జట్టైనా వరుసగా రెండో మూడో మ్యాచ్‌లను ఓడితేనే డీలాపడతాయి. అలాంటిది ముంబయి ఏకధాటిగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనా టాప్4లో స్థానం పదిలం చేసుకొంది. 2014 టీ20 సీజన్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టినా సరే ఆ పోరాట పటిమను ఎప్పటికీ మరువలేం. చెన్నై, కోల్‌కతా జట్లపై మాత్రమే ఓడిన ముంబయి రెండో రౌండ్‌లో మిగతా టీమ్‌లపై విజయం సాధించడం విశేషం.
ఏడు విజయాలు.. ఏడు ఓటములు: అప్పుడు ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్న లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఏడు విజయాలను నమోదు చేయాలి. అప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండాలి. అప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడిన ముంబయికి అవకాశం లభించదని అభిమానులు నిరాశ పడ్డారు. అయితే, వారి అంచనాలను తప్పని రుజువు చేస్తూ తన ఆరో మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు మొత్తం తొమ్మిదింట ఏడు విజయాలు, రెండు అపజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌కు కూడా సరిగ్గా పద్నాలుగే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకొంది. సరిగ్గా ఇలానే 2022వ ఏడాది సీజన్‌లోనూ ముంబయి రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మెగా వేలమే కారణమా...?:ఇక ఈ సీజన్ విషయానికొస్తే.. విజయం ముంగిట బోల్తా పడటం ముంబయికి పరిపాటిగా మారింది. దీనింతటికి కారణం మెగా వేలం అని చెప్పుకోవాలేమో. గత సీజన్ వరకు ముంబయి జట్టును తీసుకుంటే భయంకరంగా ఉండేది. కానీ, మెగా వేలంలో యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి విదేశీ సీనియర్లను కొనుగోలు చేయలేదు. అయితే, ఇదంతా సంధి కాలమని పైకి చెప్పుకుంటున్నా వారులేని లోటు బ్యాటింగ్, బౌలింగ్‌లో వైఫల్యంతో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు పాండ్య బ్రదర్స్ ఆదుకునేవారు. ఈసారి వారితో పాటు ఓపెనర్ డికాక్, కీలక బౌలర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బలహీనంగా మారింది.
ఫామ్‌ను అందుకోని హిట్టర్..:ఓపెనింగ్ శుభారంభం దక్కితే వెనుక వచ్చే బ్యాటర్లు సులువుగా హిట్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ముంబయి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరు మాత్రమే రాణించడం.. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాలు లభించకపోవడం వల్ల మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అక్కడ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లు పరుగులు రాబడుతున్నా.. కీలకమైన సమయంలో భారీ హిట్టర్ కీరన్ పొలార్డ్ చేతులేత్తేయడం ముంబయి ఓటములకు మరో కారణంగా కనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్ కీలకమైన మ్యాచుల్లోనూ తేలిపోవడం ముంబయిని మరింత కలవర పెట్టే అంశం.