ఐపీఎల్లో విజయాలు సాధించాలంటే కొన్ని జట్లు తమ టీమ్‌లలో సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరముందని సూచించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో దగ్గరి వరకు వచ్చి హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
188 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. బెయిర్ స్టో, మనీష్ పాండే అర్ధ సెంచరీల సాయంతో 177కు పరిమితమైంది. అవసరమైన సమయంలో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైందని.. మనీష్ పాండేను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. చివరి క్షణాల్లో అబ్దుల్ సమద్ గెలిపించే ప్రయత్నం చేశాడని కొనియాడాడు.
ఇదీ చదవండి:పొల్గార్ ఛాలెంజ్ టోర్నీ విజేతగా ప్రజ్ఞానంద
"మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే విధంగా ఆడే బ్యాట్స్‌మెన్ వల్ల ఐపీఎల్లో కొన్ని జట్లు ఇబ్బంది పడుతున్నాయి. వారు ధాటిగా ఆడే ప్రయత్నం చేయట్లేదు. చివర్లో హిట్టింగ్ చేయాలనుకున్న ప్లేయర్లకు ఇది సమస్యగా మారుతోంది. గతేడాది ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే పునరావృతమవుతోంది" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
కాగా, కోల్‌కతాతో మ్యాచ్‌లో ఓటమికి పలు కారణాలు వెల్లడించాడు హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ప్రణాళికల అమలు విఫలమైందని చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి జట్టులో పొడుగైన పేసర్లు ఉన్నారని తెలిపాడు. వారు విసిరిన క్రాస్ సీమ్ బంతుల్ని తాము సరిగా ఆడలేకపోయామని పేర్కొన్నాడు. కోల్‌కతా వికెట్ పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుందని.. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిందని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:'విలయమ్సన్‌కు ఇంకా సమయం పడుతుంది'