రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా కెప్టెన్ విరాట్ (kohli as rcb captain) కోహ్లీ పదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం తన జట్టు ఆటగాళ్లతో మాట్లాడాడు. ఆర్సీబీ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 2016 తర్వాత ఈ సీజనే (virat kohli in ipl 2021) తాను అత్యంత గొప్పగా ఆస్వాదించినట్లు చెప్పాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు నిరాశ చెందినా తమ పోరాటపటిమతో ఆకట్టుకున్నారన్నాడు.
"నిజం చెప్పాలంటే మాకు 2016 టోర్నీ ఎంతో ప్రత్యేకమైంది. ఆ సీజన్ తర్వాత మళ్లీ ఇప్పుడే అంత బాగా ఆస్వాదించా. ఈ బృందంతో కలిసి ఆడటం, గెలుపోటములు సమానంగా స్వీకరించడం లాంటివన్నీ నా కెంతో ప్రత్యేకం. కప్పు సాధించేందుకు ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డాం. ఈ ఓటమితో మనం నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినా మనం ఆడిన తీరుకు గర్వంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీలో మనం ప్రతిసారీ ఇదే ప్రయత్నిస్తామని అనుకుంటా" అని కోహ్లీ స్పందించాడు.