ఐపీఎల్(IPL 2021) ప్రస్తుత సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్ ముగిసిన వెంటనే కెప్టెన్సీని వదులుకోనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అయితే సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఓ వర్చువల్ మీటింగ్‌లో కోహ్లీ పాల్గొన్నాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ(Kohli Captaincy) నుంచి వైదొలగడంపై స్పష్టతనిచ్చాడు.
"కెప్టెన్సీని వదిలేయడానికి ప్రధాన కారణం నాపై ఉన్న పనిభారం. నా బాధ్యతల విషయంలో నేను నిజాయితీ లేకుండా వ్యవహరించలేను. ఏ విషయంలోనైనా వందకు నా వంతుగా 120 శాతం పనితనాన్ని ఇవ్వలేకపోయినప్పుడు దాన్ని పట్టుకోని వేలాడను. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది".
- విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందన్న నమ్మకం తనకు ఉన్నట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు. "లీగ్ పాయింట్ల టేబుల్లో టాప్-2 స్థానాల్లో మా జట్టు లేకపోవడం వల్ల ఫైనల్‌కు చేరాలంటే మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ అనే పేర్లు మ్యాచ్‌లపై ఒత్తిడిని పెంచేందుకు మాత్రమే. అయితే ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మ్యాచ్‌లో సరైన ప్రదర్శన చేస్తే గెలుస్తాం లేదా ఓడిపోతాం. అలా రెండు విధాలుగా ఆలోచించడం వల్ల ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే ఓడిపోతాం అనే ఆలోచనే లేకపోతే మన ఆటను మరోస్థాయికి చేరే అవకాశం ఉంది" అని కోహ్లీ అన్నాడు.
ఇదీ చూడండి..IPL Eliminator 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ