ఇంగ్లాండ్ నుంచి యూఏఈకి చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్(Delhi Capitals Captain).. ఆరు రోజుల క్వారంటైన్ ముగియడం వల్ల శనివారం జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో(IPL 2021 News) మొదటి దశలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు పంత్(Rishabh Pant News) పేర్కొన్నాడు.
"క్వారంటైన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరిని కలవడం సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ సమయం బాల్కనీలో కూర్చున్నా. రెండు మూడు రోజుల్లో పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడతాను. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం మా అంతిమ లక్ష్యం. మేము రూపొందించుకున్న ప్రణాళికపై దృష్టిపెట్టబోతున్నాం. మొదటి దశలో చేసిన అద్భుత ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. ఈ సారి మేం ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది."