ఈ ఏడాది వేసవిలో కరోనా కారణంగా ఐపీఎల్ 14వ (Ipl-2021) సీజన్ అర్ధంతరంగా ఆగిపోయడంతో అందరిలోనూ సందిగ్ధత! మిగిలిన మ్యాచ్‌ల పరిస్థితేంటన్న సందేహం. ఇప్పుడు యూఏఈ వేదికగా ఐపీఎల్-14 పునఃప్రారంభమవుతోంది. ఆదివారం నుంచే అభిమానులను అలరించేందుకు లీగ్ రెండో దశ సిద్ధమైంది. మరి.. సీజన్‌కు మధ్యలో బ్రేక్ పడకముందు జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయి? వాటి ప్రదర్శన ఎలా ఉంది? ఇప్పుడు ముందంజ వేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో చూసేద్దాం పదండి.
ప్లేఆఫ్‌కు చేరువలో..
దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals).. ఐపీఎల్ 14వ సీజన్ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టే తొలి జట్టుగా కనిపిస్తోంది. తొలి దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో అంచెలో ఆడనున్న ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు ఖాయమవుతుంది. శ్రేయస్ పునరాగమనం ఆ జట్టు బలాన్ని పెంచేదే. వోక్స్ స్థానంలో డ్వార్షుయిజ్ జట్టులోకొచ్చాడు. ధావన్, పృథ్వీ, శ్రేయస్, స్మిత్, పంత్‌లతో బ్యాటింగ్.. రబాడ, నార్జ్, అవేష్, అశ్విన్‌లతో బౌలింగ్ పటిష్ఠంగా ఉన్నాయి.
సీఎస్కే మళ్లీ..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై(Csk Team) నిరుడు నిరాశపరిచినా.. ఈసారి పుంజుకుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మిగతా 7 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు పక్కా. రెండు నెగ్గినా ఛాన్సుంటుంది. గతేడాది యూఏఈలోనే జరిగిన సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన పేలవం. మళ్లీ ఇప్పుడు అక్కడ ఆడబోతుండటం ఆ జట్టుపై ప్రభావం చూపుతుందేమో చూడాలి. తొలి దశ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన డుప్లెసిస్ ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడం ఇబ్బందే. ఆల్‌రౌండర్లు జడేజా, మొయిన్ అలీ, సామ్ కరన్, బ్రావో ఆ జట్టుకు బలం.
ఈసారైనా..
ఇప్పటిదాకా టైటిలే గెలవని బెంగళూరు (Rcb Team) ఈసారి కల నెరవేర్చుకునే దిశగా సాగుతోంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో మూడో స్థానంలో ఉన్న కోహ్లీసేన.. మిగతా ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గినా ప్లేఆఫ్ చేరొచ్చు. యూఈఏకి రాలేకపోయిన జంపా, సామ్స్, రిచర్డ్‌సన్, అలెన్ స్థానాల్లో హసరంగ, చమీర, గార్టన్, డేవిడ్‌లను ఆర్‌సీబీ తీసుకుంది. సీజన్‌లో అత్యధిక వికెట్ల బౌలర్‌గా కొనసాగుతున్న హర్షల్త్‌ో పాటు సిరాజ్, జేమీసన్, చాహల్‌ల రూపంలో నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉన్నారు. సుందర్ యూఏఈ మ్యాచ్‌లకు దూరమవడం దెబ్బే. బ్యాటింగ్ భారం కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌పైనే ఉంది.
అలవాటు కొనసాగిస్తుందా?
రికార్డు స్థాయిలో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి.. (Mumbai Indians Team)మరోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో యూఈఏ చేరింది. గత సీజన్‌లో ఇదే గడ్డపై ట్రోఫీ సొంతం చేసుకున్న ఆ జట్టు.. దాన్ని పునరావృతం చేస్తుందా అన్నది చూడాలి. తొలి ఏడు మ్యాచ్‌ల్లో 4 విజయాలే సాధించిన ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే ఏడు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు మూణ్నాలుగు విజయాలవసరం. కెప్టెన్ రోహిత్‌కు తోడు డికాక్, సూర్యకుమార్, హార్దిక్, కృనాల్, పొలార్డ్, బుమ్రా, బౌల్ట్ లాంటి మేటి ఆటగాళ్లున్న ముంబయికి అదేమంత కష్టమేమీ కాదు.