అహ్మదాబాద్ వేదికగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. దిల్లీ విజయానికి ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమవగా.. క్రీజులో ఉన్న పంత్ ఫోర్ కొట్టాడు. దీంతో కోహ్లిసేన ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకూ ఆర్సీబీ.. ఆరు మ్యాచులాడి ఐదింటిలో విజయం సాధించింది. గత సంవత్సరం ఫైనల్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్ కూడా ఇప్పటివరకూ ఆరు మ్యాచులు ఆడి.. నాలుగు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి:ఐఓఏ ఉపాధ్యక్షుడు జనార్ధన్ సింగ్ కన్నుమూత
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ప్రదర్శనపై బుధవారం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ సారి ఐపీఎల్‌లో కొత్త జట్టును విజేతగా చూసే అవకాశం ఉందన్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లి కలిసి ఉన్న ఫొటోను రవిశాస్త్రి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ "గతరాత్రి జరిగిన మ్యాచ్ అద్భుతమైనది. ఈ సారి కొత్త జట్టు విజేతగా నిలిచే అవకాశముంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి" అనే వ్యాఖ్యను జతచేశాడు. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేదు.
ఇదీ చదవండి:ఐపీఎల్‌లో వార్నర్ రికార్డు.. తొలి ఆటగాడిగా ఘనత