రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండ్ జోరుతో(RCB Vs RR) అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్ (50 నాటౌట్), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (44) మెరవడం వల్ల బుధవారం జరిగిన మ్యాచ్‌లో(IPL 2021) 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మొదట రాజస్థాన్ 9 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. లూయిస్ (58) ధనాధన్ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో మంచి స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్‌కు చాహల్ (2/18), షాబాజ్ అహ్మద్ (2/10), హర్షల్ పటేల్ (3/34) కళ్లెం వేశారు. భరత్, మ్యాక్స్‌వెల్‌ల జోరుతో లక్ష్యాన్ని బెంగళూరు 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఆ ఇద్దరి జోరు..
పెద్దదేమీ కాని లక్ష్య ఛేదనలో బెంగళూరుకు మంచి ఆరంభమే లభించింది. కోహ్లీ (25), పడిక్కల్ (22) చక్కగా బ్యాటింగ్ చేయడం వల్ల అయిదు ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 48/0తో నిలిచింది. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న దశలో బెంగళూరు.. కొద్ది తేడాతో స్థిరపడ్డ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఆరో ఓవర్లో పడిక్కల్‌ను ముస్తాఫిజుర్ బౌల్డ్ చేయగా, ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ.. పరాగ్ సూపర్ త్రోకు రనౌటయ్యాడు. రాజస్థాన్ ఒత్తిడిని కొనసాగించే ప్రయత్నం చేసింది.
కానీ భరత్, మ్యాక్స్‌వెల్ సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 13వ ఓవర్లో బెంగళూరు స్కోరు 100 దాటింది. తర్వాత తెవాతియా బౌలింగ్‌లో భరత్ ఓ చూడముచ్చటైన రివర్స్ స్వీప్‌తో బౌండరీ రాబట్టాడు. 15 ఓవర్లకు స్కోరు 123/2. తర్వాతి ఓవర్లోనే అతడు ఔట్ కావడం వల్ల కాస్త ఆసక్తి రేగింది. కానీ రాజస్థాన్‌కు మ్యాక్స్‌వెల్ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు బాదేసి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు.
లూయిస్ ధనాధన్?
రాజస్థాన్ చేజేతులా భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ మెరుపులతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 56/0తో నిలిచింది. జైశ్వాల్ (31)తో కలిసి అతను తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 91/1తో రాజస్థాన్ భారీ స్కోరుపై కన్నేసింది.