పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌పై స్పందించాడు విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్.. క్రిస్ మోరిస్‌కు స్ట్రైక్ నిరాకరించడాన్ని సమర్థించాడు. తన దృష్టిలో అదేమీ ఎత్తి చూపాల్సిన అంశం కాదని చెప్పుకొచ్చాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. రాహుల్, హుడా ధాటికి నిర్ణీత ఓవర్లలో 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబాటుకు గురైంది. 25 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం ఒంటరి పోరాటంతో తిరిగి జట్టును బరిలో నిలిపాడు రాజస్థాన్ సారథి సంజు శాంసన్.
ఇదీ చదవండి:ఐపీఎల్: సిక్సర్లలో మరో మైలురాయి దాటిన గేల్
"నాకు తెలిసి శాంసన్ తీసుకున్నది సరైన నిర్ణయం. ఆ సమయంలో ఇద్దరిలో బౌండరీ కొట్టాల్సి వస్తే అది సంజు కావాలనే నేను కోరుకుంటాను. ఒకవేళ ఆ సమయంలో రెండో పరుగుకు ప్రయత్నిస్తే రనౌట్ అయ్యే అవకాశం ఉంది. శాంసన్ నిర్ణయం నాకేమీ తప్పనిపించలేదు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు పరుగుకు నిరాకరించడం తప్పేమీ కాదు."
-బ్రియాన్ లారా, విండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్.
సంజు బ్యాటింగ్‌తో 12 బంతుల్లో 22 పరుగులుగా సమీకరణం మారిపోయింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి తెవాతియా ఔటయ్యాడు. దీంతో క్రిస్ మోరిస్ బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికే నాలుగు బంతులు ఎదుర్కొని రెండు బంతులను వృథా చేసిన మోరిస్‌కు.. చివరి ఓవర్లో రన్‌కు నిరాకరించాడు సంజు. ఆ ఓవర్లో నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి శాంసన్ క్యాచ్ ఔటయ్యాడు.
ఇదీ చదవండి:తెవాతియా అద్భుత క్యాచ్.. పరాగ్ చిత్రమైన బంతి