భుజం గాయం కారణంగా ఐపీఎల్ 14 సీజన్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం కావడం వల్ల అతని స్థానంలో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు రిషభ్ పంత్. ఇప్పటివరకు పంత్ ఆరు మ్యాచులకు నాయకత్వ బాధ్యతలు వహించగా.. నాలుగు మ్యాచుల్లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో దిల్లీ పరాజయం పాలైంది. ఈ మ్యాచులో రిషభ్ పంత్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు) రాణించగా.. హెట్‌మైర్ (53; 25 బంతుల్లో 2×4, 4×6) చివర్లో ధాటిగా ఆడాడు.
ఈ క్రమంలో రిషభ్ పంత్ ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నాడని భారత మాజీ స్పిన్నర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. రాబోయే సంవత్సరాల్లో రిషభ్ పంత్ పరిణతి చెందిన నాయకుడిగా అభివృద్ధి చెంది భవిష్యత్‌లో భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు.