తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: పంజాబ్​పై రాజస్థాన్ రాయల్స్​​ అద్భుత విజయం

పంజాబ్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్​లో 2 పరుగులు తేడాతో విజయం సాధించింది.

rajasthan
రాజస్థాన్​

By

Published : Sep 21, 2021, 11:45 PM IST

Updated : Sep 22, 2021, 1:23 AM IST

ఐపీఎల్‌ రెండో దశను రాజస్థాన్‌ విజయంతో ఆరంభించింది. పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్‌ (67; 43 బంతుల్లో 7×4, 2×6), కేఎల్ రాహుల్‌ (49; 33 బంతుల్లో 4×4, 2×6) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా, కార్తీక్‌ త్యాగి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రెండు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో పంజాబ్‌ ఓటమిని మూటగట్టుకుంది. మొదటి నుంచి పంజాబ్‌ విజయం దిశగా సాగినప్పటికీ చివరి ఓవర్‌లో మ్యాచ్‌ అనూహ్య మలుపు తిరిగింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌటైంది. రాజస్థాన్‌ జట్టులో యశస్వీ జైస్వాల్‌ (49; 36 బంతుల్లో 6×4, 2×6), మహిపాల్‌ లోమ్రోర్‌ (43; 17 బంతుల్లో 2×4, 4×6) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. షమి మూడు వికెట్లు తీశాడు. పొరెల్‌, హర్‌ప్రీత్ బ్రర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

దంచికొట్టిన మయాంక్‌, రాహుల్‌..

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ ఓపెనర్లు తొలి మూడు ఓవర్లలో నెమ్మదిగా ఆడినా.. తర్వాత వేగం పెంచారు. చేతన్ సకారియా వేసిన నాలుగో ఓవర్‌లో రాహుల్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదాడు. తర్వాత కార్తీక్ త్యాగి వేసిన ఎనిమిదో ఓవర్‌లో మయాంక్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అనంతరం మోరిస్‌ వేసిన పదో ఓవర్‌లో మాయాంక్‌ మరింత జోరు పెంచాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌ కూడా ఓ ఫోర్‌ బాదడం వల్ల ఈ ఓవర్‌లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. సకారియా వేసిన 12వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఔట్‌ కాగా.. తర్వాత తెవాటియా వేసిన 13వ ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (32; 22 బంతుల్లో 1×4, 2×6), మార్‌క్రమ్‌(26) మ్యాచ్‌ను విజయతీరాలవైపు నడిపించారు. ఈ క్రమంలో పంజాబ్‌ విజయ లక్ష్యం 6 బంతుల్లో 4 పరుగులుగా మారింది.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన కార్తీక్‌ త్యాగి..

చివరి ఓవర్‌ వేసిన కార్తీక్ త్యాగి అద్భుతమే చేశాడు. మొదటి బంతికి పరుగులు రాలేదు. రెండో బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 4 పరుగులుగా మారింది. అద్భుతంగా వేసిన మూడో బంతికి నికోలస్‌ పూరన్‌.. శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ చేశాడు. నాలుగో బంతికి పరుగులు రాలేదు. ఐదో బంతికి హుడా డకౌటయ్యాడు. దీంతో సమీకరణం ఒక్క బాల్‌కు మూడు మూడుపరుగులు చేయాల్సిన పరిస్థితి. స్ట్రైకింగ్‌లో ఉన్న ఫాబియన్ అలెన్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చివరి ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి కేవలం ఒక్కపరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ రాయల్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సకారియా, రాహుల్ తెవాటియా తలో వికెట్‌ తీశారు.

కేఎల్​ రాహుల్ రికార్డు

ఈ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ కేఎల్​ రాహుల్​ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్​లో మూడు వేల పరుగులు చేసిన రెండో ఫాస్టెస్ట్​ బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఈ మార్క్​ను 80 ఇన్నింగ్స్​లో అందుకున్నాడు. అంతకుముందు క్రిస్​గెల్​ 75 ఇన్నింగ్స్​లోనే ఈ ఘనతను అందుకోగా.. డేవిడ్​ వార్నర్​(94), సురేశ్​ రైనా(103) ఇన్నింగ్స్​లో చేరుకున్నారు.

ఇదీ చూడండి:IPL 2021: రాజస్థాన్​ ధనాధన్​ బ్యాటింగ్​.. పంజాబ్​ లక్ష్యం 186

Last Updated : Sep 22, 2021, 1:23 AM IST

ABOUT THE AUTHOR

...view details