వరుస ఓటముల తర్వాత ముంబయికి ఊరట. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి జట్టులో సౌరభ్ తివారి (45: 37 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య(40 నాటౌట్: 4x4, 2x6) రాణించారు. చివరి ఓవర్లలో పాండ్య సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ముంబయి విజయం తేలికైంది. అంతకు మందు ముంబయి బౌలర్లు 6 వికెట్లు తీసి పంజాబ్‌ను 135 పరుగులకే కట్టడి చేశారు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన పొలార్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
పాండ్య మెరుపులు..
పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ(8), సూర్యకుమార్ యాదవ్(0)ను రవిబిష్ణోయ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో సౌరభ్ తివారి(45)తో జట్టు కట్టిన క్వింటన్ డికాక్(27) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లతో స్కోర్‌ను పెంచారు. ఈక్రమంలో 9.5 ఓవర్ల వద్ద డికాక్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ముంబయి స్కోరు 10 ఓవర్లకు 62/3 గా నిలిచింది. ఇదే క్రమంలో 15.1 ఓవర్ల వద్ద అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సౌరభ్ తివారి ఔటయ్యాడు. నాథన్ ఎలీస్ వేసిన బౌలింగ్ కీపర్‌కు చిక్కాడు. దీంతో క్రీజులోకి వచ్చిన పోలార్డ్‌తో జట్టు కట్టిన హార్దిక్ పాండ్య మొదట నెమ్మదిగా ఆడినప్పటికీ తర్వాత వేగం పెంచాడు. మహమ్మద్ షమి వేసిన 17 ఓవర్లో హార్దిక్ ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లలో పోలార్డ్(15) ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఇక ముంబయి లక్ష్యం చిన్నదైంది. ఇక రెండు ఓవర్లలో ముంబయికి 16 పరుగులు అవసరం కాగా ఇక 19 ఓవర్లో పాండ్య విశ్వరూపం చూపించాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో చెలరేగడంతో ముంబయి ఒక ఓవర్ ఉండగానే గెలుపొందింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మార్‌క్రమ్ (42; 29 బంతుల్లో 6 ఫోర్లు), దీపక్ హుడా (28 ) రాణించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (21), మన్‌దీప్ సింగ్ (15) శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్‌లుగా మలచలేకపోయారు. పంజాబ్ 36 పరుగుల వద్ద మన్‌దీప్ సింగ్ ఔటయ్యాడు. తర్వాత కీరన్ పొలార్డ్ వేసిన ఓవర్‌లో పంజాబ్‌కి గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్‌లో క్రిస్ గేల్ (1), కేఎల్ రాహుల్ ఔటయ్యారు. ఎనిమిదో ఓవర్‌లో నికోలస్ పూరన్ (2)ని బుమ్రా పెవిలియన్ పంపించాడు. దీంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న జట్టును మార్‌క్రమ్, దీపక్ హుడా ఆదుకున్నారు. బౌల్ట్ వేసిన 15వ ఓవర్‌లో మార్‌క్రమ్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. హుడా ఓ బౌండరీ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. ప్రమాదకరంగా మారుతున్న మార్‌క్రమ్‌ని రాహుల్ చాహర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో దీపక్ హుడా పొలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 135 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్లలో పొలార్డ్, బుమ్రా రెండు, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.
ఇవీ చూడండి: ఇది మరీ ఫన్నీ.. ఇలా కూడా ఔట్ అవుతారా?