తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించిన తొలి జట్టుగా సీఎస్కే

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. తద్వారా ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

csk
సీఎస్కే

By

Published : Sep 30, 2021, 11:03 PM IST

Updated : Oct 1, 2021, 1:05 AM IST

ఐపీఎల్ రెండో అంచెలో చెన్నై సూపర్ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (45: 38 బంతుల్లో 4x4, 2x6), డుప్లెసిస్‌ (41: 36 బంతుల్లో 3x4, 2x6) ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి మ్యాచ్‌ రెండు మూడు ఓవర్ల ముందుగానే ముగుస్తుందనిపించింది. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటిన తర్వాత స్వల్ప తేడాతో మొయిన్ అలీ (17), సురేశ్‌ రైనా (2), డుప్లెసిస్‌ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలోనే లక్ష్యం రెండు ఓవర్లలో 16 పరుగులుగా మారింది. అయితే, భువనేశ్వర్‌ కుమార్ వేసిన 18 ఓవర్లో రాయుడు ఓ సిక్స్‌, ధోనీ ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు సిద్ధార్ధ్‌ కౌల్ కేవలం ఒకే పరుగు ఇచ్చాడు. దీంతో క్రీజులో రాయుడు, ధోనీ ఉన్నప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే తర్వాతి బంతిని కెప్టెన్ ధోనీ భారీ సిక్సర్‌గా మలిచి చెన్నై జట్టుకు విజయాన్నందించాడు. ఈ విజయంతో చెన్నై అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరినట్లయింది. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ మూడు, రషీద్ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఓపెనర్‌ వృద్ధిమాన్ సాహా (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలోనే ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (2) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్‌ శర్మ (18), అబ్దుల్ సమద్‌ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే హేజిల్‌ వుడ్‌ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవడంతో హైదరాబాద్‌ జట్టుకి షాక్‌ తగిలింది. జేసన్‌ హోల్డర్‌ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్‌ వచ్చిన రషీద్‌ ఖాన్‌ (17), భువనేశ్వర్‌ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్‌ 3, బ్రావో 2, శార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా తలో వికెట్ తీశారు.

Last Updated : Oct 1, 2021, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details