తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: కుర్రాళ్ల ప్రదర్శనతో కోల్​కతా ప్లేఆఫ్స్​​ ఆశలు సజీవం! - hotstar ipl 2021

ఐపీఎల్​లో(IPL 2021) గురువారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా బ్యాట్స్​మెన్​ వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి.. అద్భుతంగా రాణించారు. వీరిద్దరి విధ్వంసానికి బలమైన ముంబయి బౌలింగ్‌ దళం(KKR Vs MI 2021) తేలిపోయింది. 156.. పరుగుల లక్ష్యం మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతాకు కీలక విజయం దక్కింది. ఆ జట్టు నాలుగో విజయంతో నాలుగో స్థానానికి(IPL Points Table 2021) ఎగబాకి ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి అయిదో ఓటమితో తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

IPL 2021, MI vs KKR Highlights: Venkatesh Iyer stars as Kolkata romp home by 7 wickets
IPL 2021: కుర్రాళ్ల ప్రదర్శనతో కోల్​కతా ప్లేఆఫ్స్​​ ఆశలు మెరుగు!

By

Published : Sep 24, 2021, 6:52 AM IST

Updated : Sep 24, 2021, 9:39 AM IST

ఐపీఎల్‌ రెండో అంచెలో(IPL 2021) కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వరుసగా రెండో విజయం. రాహుల్‌ త్రిపాఠి (74 నాటౌట్‌; 42 బంతుల్లో 8×4, 3×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (53; 30 బంతుల్లో 4×4, 3×6) వీర విహారం చేయడంతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను(KKR Vs MI 2021) చిత్తు చేసింది. 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా.. 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట ముంబయి 6 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. డికాక్‌ (55; 42 బంతుల్లో 4×4, 3×6) టాప్‌ స్కోరర్‌. ఫెర్గూసన్‌ (2/27), నరైన్‌ (1/20), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/43), వరుణ్‌ చక్రవర్తి (0/20) ముంబయిని కట్టడి చేశారు.

ఆ ఇద్దరు దంచేశారు..

అసలే సాధారణ లక్ష్యం. ఆపై దాన్ని మరింత తేలిక చేశాడు కొత్త సంచలనం వెంకటేశ్‌(Venkatesh Iyer IPL 2021) అయ్యర్‌. తన తొలి మ్యాచ్‌లో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. ఈసారి మరింతగా చెలరేగాడు. ఏడాపెడా బౌండరీలతో కోల్‌కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతి (బౌల్ట్‌)నే డీప్‌ స్క్వేర్‌లో సిక్స్‌గా మలిచి ఉద్దేశాన్ని చాటిన వెంకటేశ్‌.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. మైదానం అన్నివైపులా కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేశాడు. మిల్నె వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సిక్స్‌, రెండు ఫోర్లు బాదేశాడు. కోల్‌కతా.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(13)ను కోల్పోయి 3 ఓవర్లకే 40 పరుగులు చేసింది. నిజానికి తక్కువ లక్ష్యాన్ని కూడా కాచుకోగల బౌలింగ్‌ దళం ముంబయికి ఉంది. అలా చేసిన సందర్భాలెన్నో. కానీ ఈసారి బుమ్రా, బౌల్ట్‌ సహా ఎవరి పప్పులూ ఉడకలేదు.

వెంకటేశ్‌తో పోటీపడుతూ రాహుల్‌ త్రిపాఠి(Rahul Tripathi Vs MI) కూడా రెచ్చిపోవడం వల్ల ముంబయికి ఎలాంటి అవకాశమూ లేకపోయింది. త్రిపాఠి భారీ షాట్లతో ముంబయి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ బౌండరీల మోత మోగించడం వల్ల కోల్‌కతా చాలా వేగంగా లక్ష్యం దిశగా సాగింది. 10 ఓవర్లు ముగిసే సరికే స్కోరు 111/1. ఆ తర్వాత వెంకటేశ్‌ (25 బంతుల్లో), త్రిపాఠి (29 బంతుల్లో) అర్ధశతకాలు పూర్తి చేశారు. బుమ్రా వేసిన 12వ ఓవర్లో తిప్రాఠి ఓ సిక్స్‌, ఫోర్‌ బాదేశాడు. అదే ఓవర్లో వెంకటేశ్‌ బౌల్డయినా కోల్‌కతాకు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేకపోయింది. ఎందుకంటే అప్పటికి స్కోరు 128. త్రిపాఠి జోరుతో మిగతా పని పూర్తి చేయడానికి కోల్‌కతాకు ఎంతో సమయం పట్టలేదు.

ముంబయి కట్టడి

మ్యాచ్‌లో ముంబయికి మంచి ఆరంభమే దక్కినా.. కోల్‌కోతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టును కట్టడి చేయగలిగింది. టాస్‌ గెలిచిన ముంబయి ఇన్నింగ్స్‌ను రోహిత్‌, డికాక్‌ ఆరంభించారు. రోహిత్‌ (33; 30 బంతుల్లో 4×4) ఆరంభంలో కాస్త బ్యాట్‌ ఝుళిపించినా తర్వాత నెమ్మదించాడు. ధాటిగా ఆడలేకపోయాడు. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. అయితే క్రమంగా దూకుడు పెంచిన మరో ఓపెనర్‌ డికాక్‌.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. ఫెర్గూసన్‌ ఓవర్లో ఓ సిక్స్‌ బాదిన అతడు.. వెంటనే ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు దంచాడు. రసెల్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 9 ఓవర్లకు స్కోరు 77/0. కానీ ఆరంభాన్ని ముంబయి సద్వినియోగం చేసుకోలేకపోయింది. పదో ఓవర్లో రోహిత్‌ను నరైన్‌ ఔట్‌ చేయడం వల్ల ముంబయి పతనం ఆరంభమైంది. ముంబయి చివరి 10 ఓవర్లలో మరో 5 వికెట్టు కోల్పోయి 75 పరుగులే చేయగలిగింది.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌:రోహిత్‌ (సి) శుభ్‌మన్‌ (బి) నరైన్‌ 33; డికాక్‌ (సి) నరైన్‌ (బి) ప్రసిద్ధ్‌ 55; సూర్యకుమార్‌ (సి) కార్తీక్‌ (బి) ప్రసిద్ధ్‌ 5; ఇషాన్‌ కిషన్‌ (సి) రసెల్‌ (బి) ఫెర్గూసన్‌ 14; పొలార్డ్‌ రనౌట్‌ 21; కృనాల్‌ పాండ్య (సి) వెంకటేశ్‌ (బి) ఫెర్గూసన్‌ 12; సౌరభ్‌ తివారి నాటౌట్‌ 5; అడమ్‌ మిల్నె నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155; వికెట్ల పతనం: 1-78, 2-89, 3-106, 4-119, 5-149, 6-149; బౌలింగ్‌: నితిష్‌ రాణా 1-0-5-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-22-0; నరైన్‌ 4-0-20-1; ఫెర్గూసన్‌ 4-0-27-2; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-43-2; రసెల్‌ 3-0-37-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌:శుభ్‌మన్‌ గిల్‌ (బి) బుమ్రా 13; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) బుమ్రా 53; రాహుల్‌ త్రిపాఠి నాటౌట్‌ 74; మోర్గాన్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 7; నితీష్‌ రాణా నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (15.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-40, 2-128, 3-147; బౌలింగ్‌: బౌల్ట్‌ 2-0-23-0; మిల్నె 3-0-29-0; బుమ్రా 4-0-43-3; కృనాల్‌ పాండ్య 3-0-25-0; రాహుల్‌ చాహర్‌ 3-0-34-0; రోహిత్‌శర్మ 0.1-0-4-0.

ఇదీచూడండి..వెంకటేశ్, త్రిపాఠి విధ్వంసం.. ముంబయిపై కేకేఆర్ ఘనవిజయం

Last Updated : Sep 24, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details