తెలంగాణ

telangana

ETV Bharat / sports

బయోబబుల్ బలహీనపడటానికి​ కారణం అదే: దాదా - ipl biobubble corona

ఐపీఎల్​ బయోబబుల్​ బలహీన పడేందుకు గల కారణం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ లీగ్​ నిర్వహించడంపై వివరణ ఇచ్చారు.

dada
దాదా

By

Published : May 6, 2021, 3:48 PM IST

ఐపీఎల్‌ బుడగ బలహీనంగా మారేందుకు బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అంచనా వేస్తున్నారు. వాస్తవ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ లీగ్​ను జరపడం గురించి మాట్లాడారు.

"బయో బుడగ లోపల ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో నాకైతే నిజంగా తెలియదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా ప్రయాణాలు ఒక కారణం కావొచ్చు" అని దాదా అన్నారు. "ఐపీఎల్‌ నిర్వహణపై మేం నిర్ణయం తీసుకున్నప్పుడు కొవిడ్‌ విజృంభణ ఇలా లేదు. ఇప్పుడు చెప్పడం చాలా సులభం. ఈ టోర్నీ ఆరంభమైనప్పుడు ఉన్న కొవిడ్‌ కేసుల సంఖ్య అత్యంత స్వల్పం. మేం ముంబయిలో ఆరంభించి ఎలాంటి కేసులు లేకుండా ముగించాం. అప్పుడు నగరంలో ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు" అని గంగూలీ తెలిపారు.

ఇంగ్లాండ్‌ సిరీస్‌ను విజయవంతం చేసినప్పుడు ఫిబ్రవరిలో కొవిడ్‌ కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉందని గంగూలీ అన్నారు. విదేశీ ఆటగాళ్లు వారి స్వదేశానికి చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మొదట మాల్దీవులకు చేరుకొని అక్కడ క్వారంటైన్‌ పూర్తయ్యాక సురక్షితంగా ఇళ్లకు వెళ్తారని ఆశించారు. దుబాయ్‌లో బుడగను చూసుకున్న రీస్ట్రాటాకు భారత్‌లో అనుభవం లేదని అందుకే మరో సంస్థకు బాధ్యతలు అప్పజెప్పామని వెల్లడించారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దుబాయ్‌లో నిర్వహించడంపై కథనాలు వస్తున్నప్పటికీ ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని సౌరభ్ గంగూలీ అన్నారు. "ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా సమయం ఉంది. నెల రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడే మాట్లాడటం కష్టం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ యథా ప్రకారమే జరుగుతుంది. భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటారు" అని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: సెప్టెంబర్​లో ఐపీఎల్.. ఎక్కడనేదే ప్రశ్న!

ABOUT THE AUTHOR

...view details