ఐపీఎల్ రెండో దశలో ఆడేందుకు యూఏఈకి రాని విదేశీయుల జీతాల్లో కోత పడనుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు మాత్రమే వారికి వేతనాలు చెల్లిస్తారని సమాచారం. బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదట. బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఈ సీజన్లో 29 మ్యాచులే జరిగాయి. ముంబయి, చెన్నై నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌కు జట్లు చేరిన తర్వాత వైరస్ కలకలం చెలరేగింది. కొందరు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలారు. క్రికెటర్లు ఆందోళన చెందడం వల్ల వెంటనే లీగ్‌ను నిరవధిక వాయిదా వేశారు. మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ రెండో దశ జరుగుతున్నందుకు అభిమానులు, ఫ్రాంచైజీలు సంతోషిస్తున్నా.. కొందరు విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటం వల్ల యూఏఈకి వెళ్లేందుకు అనుమతించమని ఆ బోర్డులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు వచ్చే అవకాశం లేదు.
‘అవును, అది నిజమే. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం యూఏఈకి రాకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే (ప్రొ-రాటా) చెల్లిస్తారు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. ఉదాహరణకు కమిన్స్ పూర్తి వేతనం రూ.15.5 కోట్లు. అతడు రాకుంటే రూ.7.75 కోట్లే చెల్లిస్తారు. బీసీసీఐ ఒప్పంద క్రికెటర్లకు మాత్రం ఇబ్బంది లేదు. 2011 నుంచి వారికి బీమా వర్తిస్తుండటమే ఇందుకు కారణం.
ఇవీ చదవండి: