ఐపీఎల్(IPL 2021 Final) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్‌లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అవే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR Vs CSK). ప్లేఆఫ్స్ వరకూ ఫేవరెట్ జట్లుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా కోల్‌కతా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో కోల్‌కతా ఫైనల్స్‌లో చెన్నైతో తలపడేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం స్పిన్ బౌలింగ్‌తో బలంగా ఉన్న ఆ జట్టును ధోనీసేన తుదిపోరులో ఓడించాలంటే తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను సంధించాల్సిందే. ముఖ్యంగా కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కోవడమే ఆ జట్టు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం.
ఆ ముగ్గురే కీలకం..
లీగ్ దశలో 10 విజయాలతో దిల్లీ.. 9 విజయాలతో బెంగళూరు ముందే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం నాలుగు జట్లతో పోటీపడిన కోల్‌కతా, ముంబయితో సమానంగా ఏడు విజయాలతో నిలిచినా.. రన్‌రేట్ పరంగా మెరుగ్గా ఉండటం వల్ల ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక్కడ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించింది. ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల నుంచి ఫైనల్లో చెన్నై లాంటి మేటి జట్టును ఢీకొట్టే దాకా ఆ జట్టు ప్రస్థానం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లాంటి స్పిన్నర్లు.
వావ్ అనిపించే ఎకానమీ..
షార్జా వేదికగా జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును భారీ దెబ్బకొట్టాడు. తొలుత బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లు తీసిన అతడు తర్వాత బ్యాటింగ్‌లో 26 పరుగులు చేశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీసేన విజయావశాలకు గండికొట్టాడు. అతడికి తోడు వరుణ్, షకిబ్ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోర్ చేయకుండా 138/7 పరుగులకే కట్టడి చేశారు. ఇక దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురే మరోసారి కోల్‌కతాను ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. 12 ఓవర్లకు 71/2తో ఉన్న దిల్లీ.. చివరికి 135/5 స్కోరే చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో వరుణ్(6.40), షకిబ్(6.64), నరైన్(6.44) ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈ గణాంకాలే కోల్‌కతా బౌలింగ్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్స్‌లో చెన్నై రాణించాలంటే ఈ ముగ్గుర్ని ఎదుర్కోవడమే కీలకంగా మారింది. వీరిని ధాటిగా ఆడితే చెన్నైకు తిరుగు ఉండదనే చెప్పాలి.